సినిమా అన్నదే వినోదం కోసం. ఒకప్పుడు నటులది విదూషకుల పాత్ర. సాయంత్రం వరకూ కాయకష్టం చేసినవారికి ఉల్లాసం కోసం వేషాలు వేసి తద్వారా వినోదాన్ని పంచుతూ పొట్టపోసుకునేవారు. కానీ ఈనాడు వీరు కొంతమందికి దేవుల్లు. ఇంట్లో తల్లితండ్రులకి నమస్కారం చేయనివాడు వీరికి వీధిలో దండలు వేసి దండాలు పెడతాడు. ఇంట్లోకి తినడానికి లేకపోయినా వీరి సినిమాలకి బ్లాకులో టికెట్లు కొంటారు. చదువుకోసం అరకిలోమీటర్ దూరం వెళ్ళలేరు కానీ వీరి సినిమా కోసం క్యూలో కొట్టుకొని చస్తారు. సంస్కృతి పరంగా వచ్చే పద్యాలూ, లలిత గీతాలూ, పండుగా/జోల పాటల వంటివి వినలేరు కానీ దడ దడ లాడే సినిమా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు.


అలా అనిచెప్పి మన తారలేమైనా గొప్పనటులా (అందరికీ వర్తించకపోవచ్చు) అంటే అదీ లేదు. వందలకొద్దీ టేకులు తిని, డబ్బింగులు చెప్పించుకొనెవారే ఎక్కువ. ఒకప్పుడు చక్కని స్పురధౄపులు, మంచి వాచకం కలిగి, ముఖంలో నవరసాలూ పలికించగలిగిన వారై ఉండేవారు. ఇక ఇప్పటితరంలోనైతే వారి వెనుక పెద్దలుంటే చాలు. ముక్కు నోరు సరిగాలేకున్నా మన మీద రుద్దేసే ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకానొక తరంలో హీరోయిన్లు హీరోలతో సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రలు వేసి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని చాటేలా ఉండేవారు. ఇప్పుడు కేవలం దేహప్రదర్శన చేయగలినివారికే ప్రాధాన్యత. ఇప్పుడు హీరోయిన్లే తప్ప వాంపులు లేరంటే వీరి స్థాయి ఎక్కడికి చేరిందో అర్థమవుతుంది.


పోనీ హీరోలు కానీ హీరొయిన్లు గానీ ఏమైన గొప్ప సందేశాన్నిస్తారా అదీ లేదు. పాత సినిమాలలో కష్టాన్ని, కష్టం లాగే చూపించి వీలయినంతవరకూ దానికి సామాన్యుడి స్థాయి (వాస్తవానికి దగ్గరగా) పరిష్కారం చూపించే ప్రయత్నం జరిగేది. ఇక ఈనాటి హీరోల ముందు అడవి దున్నలు గానీ, ఆంబోతులు గానీ సరి రావు. పిడికిలి బిగించారంటే శతృవు ఎంతమంది ఉన్నా దిబిడి దిబిడే (ఈ మాటకు అర్థం ఏమిటో నాకూ తెలియదు). వంద మందిని కూడా నిశ్శబ్దంగా పక్క వాడికి తెలియకుండా హతమార్చగలరు. ముగ్గురినీ కట్టకలిపి ముంచేయగలరు. సుమోలని కూడా చిటికెనవేలితో చిత్తు చేయగలరు.


అపారమైన తెలివితేటలున్నా పెద్దగా వాడరు. కానీ అవసరమనుకుంటే అరక్షణంలో లక్షలూ కోట్లూ సృష్టించగలరు. వారు అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా అవతలివారిని బురిడీ కొట్టించగలరు. ఎంతమందినైనా అలవోకగా ఏమార్చగలరు. వీరు ఎంతమందిని నరికినా పోలీసులు ఎటువంటి కేసులూ పెట్టిన దాఖాలాలుండవు. వీరు పోలీసులని చంపినా న్యాయం వెంటనే వీరికి అండగా వస్తుంది. కానీ వీరే పోలీసులైతే మాత్రం మళ్ళీ దిబిడి దిబిడే. విలన్లతో అంత్యాక్షరి ఆడేసుకుంటారు.

హీరోల చెళ్ళెళ్ళని ఎవడైనా ఏదిపించడా ఇక వాడి సంగతి తేలినట్టే. అదే హిరో ఎవరైన హీరొయిన్ వెంటబడితే ఆ హీరోయిన్ ఫామిలీ అంతా హీరోకి జై కొట్టాల్సిందే (హీరోయింతో సహా). హీరొయిన్లకి హీరోని ప్రేమించడమూ, డాన్సులు చేయడముతప్ప వేరే పనేమీ ఉండదనుకోండి.

వీరే ప్రస్త్జుత మన యువతరానికి ఆదర్శమూర్తులు. వారి గురించి ఊహించుకొని, వారిలాగా ఏమీ చేయలేక చివరికి గుండిలు విప్పుకొని తిరగడము, బలహీనుల మీద వారి ప్రతాపము చూపించడమూ చేస్తున్నారు.


హీరో పాత్రలు కొన్ని మరీ విచిత్రంగా ఉంటాయి. వీరికి తమ పక్కనున్న వారంతా వెధవలలాగా కనిపిస్తుంటారు. వారిని ఈ చెంపా ఆ చెంపా వాయించినా వారికి వీరే ప్రాణ మితృలు. వీరు స్నేహితులతో పాటు తమకన్న పెద్దవయసున్న వారిని/టిచర్లను కూడా ఇలాగే వేధించగలరు. అటువంటి లక్షణాలు ఉన్నవారు ఒకప్పుడు నీచులుగా చూడబడీతే ఇప్పుడు హీరోలుగా వెలుగుతున్నారు.

సినిమాలలో నీతులు చెప్పే వీరు నిజజీవితంలో చాలావరకూ దీనికి భిన్నంగానే ఉంటారు. పబ్లిగ్గానే జనాలని వంచిస్తారు. అయినా వీరు కొంతమందికి దేవుళ్ళు. ఇది అభిమానమని ఎవరైనా అనుకుంటే అది తప్పకుండా పిచ్చితనమే. కొన్ని సంధర్భాలలో ఈటువంటి "అభిమానులే" తమ దేవుళ్ళను ఇబ్బందులలోకి నేట్టిన సంధర్భాలూ లేకపోలేదు.

ఈ పిచ్చి ఎంతలా పెరిగిందంటే, నటినటుల పిల్లలు వారి పిల్లలు కూడా హీరోలూ, హీరోయిన్లూ కావలనుకునేంత. వారికి ఇష్టం లేకున్న వారిని బలవంతంగా ప్రజలమీద రుద్దేంత. వారెలా నటించినా ఈలవేసి గోల చేసేంత. ఇప్పుడు కొన్ని సినిమా కుటుంబాలకు కుటుంబాలే దిగిపోయి మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయినా వారినీ అభిమానించే సంఘాలూ(?) ఉంటున్నాయి. ఇక కొంతమందైతే తమ అభిమాన హీరో మీద ఎటువంటి విమర్శనూ సహించలేరు. ఇది NTR & ANR కాలం నుండీ ఉన్నా అది ఎక్కువలో ఎక్కువ అవతలివారి పోస్టర్లమీద పేడ చల్లుకునేవరకే ఉండేది. కానీ ఈ ఆధునిక యుగంలో అది అవతలివారి భవిష్యత్తును దెబ్బతీసే పోస్టులలోనూ, సినిమా రివ్యూలలోనూ కనిపిస్తోంది. లేనివారికి కూడా కుల, ప్రాంత తత్వాలను అపాదింపచేస్తోంది. పోటీ ఎక్కువై కళాకారులే కొట్టుకునేలా చేస్తోంది. అక్కడా రాజకీయాలు ప్రవేశించి మా సినిమాలే నడవాలి అనే దృష్టితో అవతలివారి సినిమా మంచిదైనా దాన్ని నడవనీయని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇవన్నీ తెలియని సగటు అభిమాని మాత్రం ఇంకా వారిని ఆరాధిస్తూనే ఉన్నారు.

ఇక సాహిత్యమైతే చెప్పాల్సిన పనే లేదు. ఒకప్పటి పాటలను వింటూ అహ్లాదాన్నే కాకుండా అర్థాన్ని, భాషమీద ప్రేమని పెంచేలా ఉండేవి. ఈనాడు ఒక పాట అర్థం కావడానికి పదుల సార్లు వినవలసి వస్తోంది. ఇక చిన్నపిల్లలు, యుక్తవయస్కులు పాటల పోటిలలో "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే" అనో లేకపొటె "ఓవైపు హాయంటాడు ఆటో సుబ్బారావు" అనో "అ అంటే అమలాపురం" వంటి పాటలు స్టేజీ ఎక్కి పాడుతూ మైమరచిపోతుంటే భాష తెలిసినవాడు/సంస్కృతి గురించి ఆలోచించేవాడు అనుభవించే చిత్రహింస మాటల్లో వర్ణించలేనిది.

అప్పుడప్పుడూ సంగీతంలో కొన్ని పాటలు తళుక్కుమన్నా కలకాలం గుర్తుండే పాటలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా వస్తున్నాయి. సాహిత్యంకన్నా హోరు/జోరు ఎక్కువై అసలు పాటేమిటో కూడా వినపడని పరిస్థితి. శంకరాభరణం వచ్చి బతికించింది కానీ లేకపోతే గాయకులు గమకాలుకూడా మరిచిపోయేవారేమో.

వీటన్నిటికీ ప్రధాన కారణం సినిమాని పూర్తిగా వ్యాపార వస్తువుగా చూడడమే. నిజానికి సినిమాని విలువలతో కూడిన మాధ్యమంగా వాడుకుంటే దీని ద్వారా అధ్బుతాలు సాధించవచ్చు. కానీ దురదృష్టవషాత్తూ ఇది ఆ స్థాయినుంచి జారి వారి అస్థిత్వానికే పరీక్షగా నిలిచింది.

ఇన్ని ఆటుపోటుల మధ్య ఏది మంచి సినిమానో తెలియని సగటు సినిమా ప్రేమికుడు మాత్రం ఇంకా ఆశగా తెరవైపు చూస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడూ మెరిసే బాహుబలి వంటి సినిమాలకోసం అంగలారుస్తూనే ఉన్నారు. అప్పటిదాకా వెగటు పుట్టించే వెకిలి సినిమాలకి బలవంతంగా బలి అవుతూనే ఉన్నాడు.

ఇది ఎవరినో విమర్శించడానికి కాదు. మనల్ని మనం విమర్శించుకోవడానికి... నిజమైన కళనూ కళాకారులనూ బ్రతికించుకోవడానికి.. దురభిమానాన్ని వదిలి నిజమైన వినోదాన్ని మన తరువాత తరాలకు అందించడానికి ...

సర్వేజనా సుఖినోభవంతు:


మరింత సమాచారం తెలుసుకోండి: