ప్రపంచానికి జగద్గురువుగా శ్రీకృష్ణుడుని ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి జగద్గురువు పుట్టినరోజు ఈసారి టీచర్స్ డే నాడు యాదృచ్చికమే అయినా ఆ జగద్గురువు పంచిన గీతామృతాన్ని తలుచుకుంటూ మరోసారి శ్రీకృష్ణ లీలలను గుర్తుకు చేసుకునే పండుగగా నేడు ప్రపంచం యావత్తు శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తితో జరుపుకుంటోoది.

పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడుని ఈ ‘గోకులాష్టమి’ రోజున దర్శిస్తే మన పాపాలు హరించిపోతాయి అని మన నమ్మకం. హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంథమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి రోజున  శ్రీ కృష్ణ దేవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి.  అందుకే ఈరోజు భక్తులు అంతా శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తూ శ్రీకృష్ణ నామాన్ని జపిస్తారు.  
 
ఈరోజు శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది అని పెద్దలు చెపుతారు. అలాగే శ్రీకృష్ణుడు సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సకల సుఖాలు, జయాలు కలుగుతాయని పండితులు చెపుతారు. అంతేకాదు ఈరోజు కృష్ణ దేవాలయంలో  శ్రీకృష్ణుని లీలా వినోద గ్రంధమైన శ్రీభాగవతాన్ని ఈరోజు చదివితే  మరణానంతరం స్వర్గ సౌఖ్యం లభిస్తుందని అంటారు.
 

హిందువులలో వైష్ణవ మతాన్ని అనుసరించేవారు ఈ కృష్ణాష్టమిని చాల భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కాకుండా దేవాలయాలలో హరినామ సంకీర్తన చేస్తూ అత్యంత ఘనంగా చిన్ని కృష్ణుడు పుట్టినరోజును భక్తి ప్రపత్తులతో జరుపుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమి అనగానే చిన్న పిల్లల శ్రీకృష్ణుడు వేషధారణ పోటీలు, ఉట్టిలు కొట్టడాలు గుర్తుకు వస్తాయి. ప్రపంచమంతా అశాంతితో సతమతమైపోతున్న నేపధ్యంలో ‘భగవద్గీత’ ను అందించిన  ఆ లీలా కృష్ణుడు మనందరికీ సుఖశాంతులను అందించాలని కోరుకుంటూ ఈ శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభం కలిగించాలని ఎపి హెరాల్డ్ ఆకాంక్షిస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: