తాను నిత్యం వార్తల్లో వ్యక్తి గా ఉండాలంటే.. ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేస్తే చాలుననే సత్యాన్ని రాంగోపాల్‌ వర్మ గ్రహించినట్లుగా ఈ ప్రపంచంలో మరెవ్వరూ పసిగట్టలేదేమో. వర్మకు సినిమా అంటే ఒక వ్యామోహం ఉంది. సినిమా మేకింగ్‌ మీద ఒక సాధికారత ఉంది. అందులో ఆయనకు తిరుగులేదు. కానీ వర్మ తనను తాను ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఊహించేసుకుని, సమాజంలోని ప్రతి విషయమ్మీదా తనకొక అమూల్యమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుని.. దాన్ని ప్రపంచం మీదికి వదిలేయాలని చూడడమే ఘోరంగా పరిణమిస్తోంది. 


ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత.. తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయం ఏర్పడడం జరుగుతుంది. పైగా వర్మ లాగా విచ్చలవిడిగా వివాదాస్పద విషయాలు మాట్లాడేవారిని మీడియా నెత్తిన పెట్టుకోవడం కూడా.. ఆయన రెచ్చిపోవడానికి ఒక హేతువు అవుతుంది. మీడియా నెత్తి మీదినుంచి దిగకుండా తన సవారీ పూర్తి చేయాలంటే.. ఎలాంటి మాటలు మాట్లాడాలో.. వర్మ చాలా తెలివిగా అవే మాట్లాడుతుంటారు. 


తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా.. వర్మ టీచర్ల మీద చవకబారు కామెంట్స్‌ చేశారు. 'నేను ఒక్కరోజు కూడా గురువులతో సంతోషంగా లేను' అని చెప్పుకుంటున్న వర్మ జీవితానుభవంలో ఎన్నిచేదు ఘటనలు ఉన్నాయో అర్థమవుతోంది. అలాంటి అనుభవాలనుంచి తయారైన ఆయన దృక్పథం ఇంతకంటె గొప్పగా ఆలోచిస్తుందనుకోవడం కూడా భ్రమ. కాకపోతే.. తన జీవితంలో మంచి టీచర్లు తారసపడకపోయినంత మాత్రాన.. ప్రపంచంలోనే మంచి టీచర్లు ఉండరని కామెంట్లు జేయడం విజ్ఞత కాదని, అది తన అజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెపుతుందని వర్మ ఎందుకు అర్థం చేసుకోరోతెలియదు. ''సక్సెస్‌ఫుల్‌ టీచర్లు ఎక్కడైనా ఉంటారేమో నాకు తగల్లేదు'' అనగల విజ్ఞత లేకపోవడం గమనించాలి. తనకు తగిలిన అనుభవాలని ప్రపంచానికంతా పులిమేస్తూ చెప్పడాన్ని కూడా గమనించాలి. అన్నిటికంటె ముందు తాను సర్వజ్ఞుడననే భావనను ఆయన తొలగించుకోవాలి. 


''నాకు తోచింది నేను చెప్తా. నిన్ను చదవమని నేను అనడం లేదు కదా.. వదిలేయ్‌. అది నచ్చిన వాళ్లే చదువుతారు.. నువ్వెందుకు జోక్యం చేసుకుంటావ్‌'' అంటూ ఆయన మొండిగా వాదించవచ్చు గాక.. కానీ.. తన మాటలు రేపటి తరాల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ వర్గంలో.. కనీసం ఒక్క శాతం అయినా మంచి వాళ్లుంటే.. వాళ్లను హర్ట్‌చేసి.. వారి చిత్తశుద్ధిని గాయపరచినా.. జాతికి జరిగే ద్రోహం తనవల్లేనని ఆయన తెలుసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: