ఈరోజు సాయంత్రం అత్యంత ఘనంగా జరగబోతున్న ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భాగ్యనగరంలోని మెగా అభిమానులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడ మెగా అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపధ్యంలో ఈ ఆడియో వేడుక పాసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అని టాక్. 

ఈరోజు పబ్లిక్ హాలిడే కూడ కావడంతో మెగా అభిమానుల హడావిడి ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో మరింత ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. పవన్ తన కుటుంబ సభ్యుల సినిమా ఫంక్షన్స్ కు ఆడియో వేడుకలకు రాకపోయినా పవన్ ను కుటుంబ సభ్యులు పిలవడం సాధారణంగా మారిపోయింది. ఆమధ్య జరిగిన వరుణ్ తేజ్ ‘కంచె’ ఆడియో వేడుకకు కూడ ఆ సినిమా దర్శకుడు క్రిష్ చేత పవన్ ను ఆహ్వానించారు అనే వార్తలు ఉన్నాయి.

ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గతంలో పవన్ తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను తీసిన నిర్మాత డివివి దానయ్య చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ కి కూడ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో ఆ అనుభందం రీత్యా ఈరోజు సాయంత్రం జరుగుతున్న ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకకు రమ్మని పవన్ ను ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ తాను నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఐటమ్ సాంగ్ షూటింగ్ లో ఉండటంతో రాలేను అని సున్నితంగా తెలియచేసినట్లు టాక్.

అయితే ఈ సమస్య ఇంతటితో తీరిపోకుండా అనేక మంది మెగా అభిమానులు హాజరవుతున్న ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో ముఖ్య అతిధిగా వస్తున్న చిరంజీవిని చూడగానే మళ్ళీ మెగా అభిమానులు పవన్ ప్రస్తావన తీసుకు వస్తారా? అన్న భయం బ్రూస్ లీ టీమ్ ను వెంటాడుతోంది అని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ‘బ్రూస్ లీ’ లో చిరంజీవి ప్రత్యేక పాత్ర చేయడం వల్ల ఏర్పడిన క్రేజ్ తో ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల స్థాయిని దాటింది అని వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: