చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి మెగా స్టార్ వ్యక్తపరిచిన విచిత్రమైన సెంటిమెంట్ దర్శకుడు వినాయక్ కు షాక్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య వినాయక్ చిరంజీవిల మధ్య జరిగిన చర్చలలో ఈ సెంటిమెంట్ ప్రస్తావన వచ్చినట్లు టాక్. చిరూ తన 150వ సినిమాగా ‘కత్తి’ రీమేక్ ను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఈ సెంటిమెంట్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. 

‘కత్తి’ సినిమాకు టైటిల్ గా ఏ పేరు పెట్టాలి అన్న ప్రాధమిక చర్చలు జరిగినప్పుడు చిరంజీవి తీయబోయే తన 150వ సినిమాకు ‘ఖైదీ’ అనే పదం ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న సెంటిమెంటుతో ఈసినిమా టైటిల్ విషయంలో ‘ఖైదీ’ అనే పదం ఉండేలా చూడమని మెగా స్టార్ అడగడం వినాయక్ ను ఆశ్చర్యపరిచింది అని అంటున్నారు.

‘ఖైదీ’ సినిమా చిరు కెరియర్ ను ఎలా మలుపు తిప్పిందో తెలిసిన విషయమే. ఆ తర్వాత వచ్చిన ‘ఖైదీ నెం.786’ కూడా పెద్ద హిట్టే అయింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఈ సెంటిమెంట్ ను బయట పెట్టాడు అని తెలుస్తోంది. ‘కత్తి’ సినిమాలో హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేసాడు. ఆ రెండు పాత్రలలో ఒక పాత్ర పేరు జీవనాధం. సామాజిక కార్యకర్తగా కనిపించే ఈపాత్ర మల్టీ నేషనల్ కంపెనీల వల్ల రైతులకు జరుగుతున్న అన్యాలను ఎదిరిస్తుంది. 

ఈ సందర్భంలో రైతుల కోసం ఉద్యమాలు చేస్తున్న జీవనాదాన్ని జైల్లో పెడతారు ఆ తరువాత ఆ పాత్ర జైలు నుంచి తప్పించుకుని బయటికి వస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రీమేక్ కు  ‘ఖైదీ’ అనే పదం వచ్చేడట్లుగా సినిమా టైటిల్ పెడితే బాగుంటుందని చిరంజీవికి ఉన్న సెంటిమెంట్ అని అంటున్నారు. ప్రస్తుతం వినాయక్ దగ్గర ఉన్న స్క్రిప్ట్ రైటర్స్ రెండు టీమ్ లుగా ఏర్పడి ఈసినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి. చివరి నిముషంలో చిరంజీవి మనసు మళ్ళీ మారకుండా ఉంటే ‘ఖైదీ’ పేరుతో మరో సినిమా వచ్చే అవకాశం ఉండవచ్చు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: