సినీనటులంటే జనంలో ఎంతో క్రేజ్ ఉంటుంది. వారిని అనుసరించేవారు ఎందరో ఉంటారు. నటీనటుల కాస్ట్యూమ్స్, మేనరిజమ్స్ అన్నీ అభిమానులకు ఆసక్తిదాయకమే.. అందుకే సెలబ్రెటీలు, నటీనటులు ఏంచేసినా దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు చాలా మంది ఫాన్స్.

అలాంటి సినీహీరోలు జనం కష్టాలను కూడా అప్పుడప్పుడు పట్టించుకోవాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలాంటి వారికి అండదండా ఇవ్వాల్సిన బాధ్యత సమాజంలో అందరిదీ.. కానీ సినీహీరోలు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తే... వారినే ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతారు.

ఈ విషయంలో పెద్ద హీరోల సంగతేమో గానీ... కుర్ర హీరో నాగ శౌర్య మాత్రం ముందువరుసలోనే ఉన్నాడు... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసిన రైతు సహాయ నిధికి తన వంతుగా 50 వేల రూపాయలు విరాళంగా అందించాడు. 50 వేల రూపాయలు పెద్ద ఎమౌంట్ కాకపోవచ్చు కానీ... ఎంతో కొంత ఇవ్వాలన్న ఆ కుర్రాడి సామాజిక బాధ్యత మెచ్చుకోదగిందే.

రైతులనే కాదు... నాగశౌర్య ఇంకో మంచి పని చేశాడు.. ఇటీవల దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ వీరజవాను కుటుంబానికి కూడా చేయందించాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన వీర జవాన్ సత్యం ఇటీవల పాక్ కాల్పుల్లో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సత్యం కుటుంబాన్ని పరామర్శించిన నాగశౌర్య... ఆయన పిల్లల పేరుపై 50 వేల రూపాయలు డిపాజిట్ చేశాడు. తెరపై చెలరేగి పోయే హీరోలు చాలామందే ఉంటారు. కానీ నిజ జీవితంలోనూ హీరోలుగా ఇలాంటి వారు నిలుస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: