మెగా స్టార్ గా , అన్నయ్య గా , చిరు గా అభిమానుల గుండెల్లో దాదాపు మూడు దశాబ్దాలు తిష్ట వేసుకుని కూర్చున్న మెగా స్టార్ ఏడు సంవత్సరాల తరవాత మళ్ళీ తెరమీద బ్రూస్ లీ సినిమా తో అడుగు పెట్టబోతున్నారు.అప్పట్లో రాజకీయ పార్టీ పెట్టి సాహసం చేసాడని అన్నారు కానీ పెట్టిన కొన్ని నెలలలోనే డబ్బై లక్షల ఓట్లు తెచ్చుకుని పరవాలేదు అనిపించుకున్నాడు. ఆ తరవాత కేంద్ర మంత్రి అయ్యాడు, తన వారసులు గా ఎంతమందిని పంపిస్తున్నా జనాలు ఆదరిస్తూనే ఉన్నారు అంటే చిరంజీవి అనే మహావృక్షం ఎంత సాధించింది అనేది మాటల్లో చెప్పనలవి కాని విషయం.


అరవై ఏళ్ళ వయసు లో ఆయన హీరో గా మరొక సినిమా చెయ్యాలి అని యావత్ తెలుగు జాతీ భావిస్తోంది అంటే దానికి ముఖ్య కారణం అభిమానులు మాత్రమే అనడం లో ఎలాంటి అతిసయోక్తీ లేనేలేదు. అలాంటి అభిమానుల మీద చిరంజీవి కోపం ప్రదర్శించడం తో ఫాన్స్ తట్టుకోలేక పోతున్నారు. అతనికి ఆరాధ్య దైవం లాంటి చిరంజీవి కి ఒకటికి రెండు సార్లు దండం పెట్టడమే ఆ అభిమాని చేసిన పాపం. బ్రూస్లీ ఆడియో వేడుక పూర్తి అయ్యాక తన మీద ఓవర్ ప్రేమ చూపించిన అభిమాని మీద చిరంజీవి మండిపడ్డారు, "స్టుపిడ్ ఫెలోస్" అంటూ తిట్టి పోశారు . రెండు రోజుల క్రితం నాటి వార్త ఇది, యూట్యూబ్ సాక్షిగా వేలాది మంది చూశారు. ఇంకా చూస్తున్నారు. కాని అదేంటో తెలుగు టివి చానెళ్లు ఈ ఉదంతాన్ని లైట్‌గా తీసుకున్నాయి. అయితే ఈ విషయాన్ని తెలుగు మీడియా పూర్తిగా విస్మరించింది.


మూడు దశాబ్దాలు అగ్రపథం లో సాగిన చిరంజీవి


తెలుగు సినిమా పరిశ్రమ లో మూడు దశాబ్దాలు అగ్రపథం లో సాగిన చిరంజీవి లాంటి ఒక సూపర్ స్టార్ అభిమానులని కించపరచడం అనే సంఘటన వీక్షకుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ మీడియా ఆ విషయం పట్టించుకోలేదు.ఈ హీరోలు కూడా మామూలు మ‌నుషులే నాయ‌నా? వారిని దేవుళ్లుగానో, మీ ప్రాణ స‌మానులుగానో ఫీలైపోకండి. వారి మీద అర్ధం లేని పిచ్చి పెంచుకుని సమయం వృధా చేసుకుని చొక్కాలు చించుకోకండి అంటూ కొందరికైనా తెలిసోచ్చేలా చెప్పాల్సిన బాధ్యత మీడియా కి లేదా? తెలంగాణా కి సంబంధించిన ఒక ఛానల్ తప్ప మరే ఛానల్ కానీ, దిన పత్రిక గానీ ఈ విషయం అసలు ప్రాధాన్య వార్తలలో చూపించలేదు.


తెలుగు రాజకీయనాయకులతో పాటు తెలుగు హీరోలకి కూడా మీడియా సాగిలపడడానికి ఉత్సుకత చూపిస్తున్నట్టు గా కనిపిస్తోంది. మ‌రే భాషా మీడియా అయినా హీరోల‌ను పొగ‌డాల్సిన‌ప్పుడు పొగుడుతుంది. వారి త‌ప్పుల్ని సైతం ఎత్తి చూపుతుంది. తెలుగు మీడియా కి కీర్తించడం తప్ప విమర్శించే ధైర్యం లేదు అని విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఆసక్తికర అంశం ఏంటంటే సినిమా, రాజకీయాలని తప్ప మరే రంగాన్నీ మీడియా వదలదు, బడి పంతులు దగ్గర నుంచీ బడా బడా భారీ పరిశ్రమల వ్యక్తుల వ్యక్తిగత విషయాల వరకూ అన్నీ రాసేస్తుంది, చూపించేస్తుంది .పొర‌పాటునో గ్రహ‌పాటునో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహ‌న‌చోద‌కుడిని ఓ చెంప‌దెబ్బ కొట్టాడ‌న్నా... రెచ్చిపోయి మ‌రీ ఎక్స్‌క్లూజివ్ క‌ధ‌నాల‌తో ఉతికి ఆరేస్తుంది. కానీ సినిమా వారి విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. హీరోలని మీడియా నెత్తికి ఎత్తుకున్నంత జనం " స్టుపిడ్ ఫెలోస్ " గానే ఉంటారు గాక .

మరింత సమాచారం తెలుసుకోండి: