తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సమయంలో వరంగల్ నుంచి ఓ ఉద్యమ కెరటంలా నిలిచారు ఆచార్య జయశంకర్. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు.  తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు.

జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అలాంటి మహనీయుడిని స్మరించుకోవం మన అదృష్టమని  తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇటీవల మెల్‌బోర్న్‌ తెలంగాణ ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్‌ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరామ్ ఆచార్య జయశంకర్‌ ఆశయాలు మరువలేనివి అన్నారు.


ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద కోదండరాం ఆయనకు నివాళులర్పించారు.  ఈ కార్యక్రమానికి మెల్ బోర్న్ లో ఉంటున్న తెలంగాణ వాసులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఎంటీఎఫ్‌ అధ్యక్షుడు రాజేష్‌రెడ్డి ముఖ్య అతిథి కోదండరాంను సన్మానించారు. అలాగే కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: