తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే ముఖ్యంగా ఉపాధిలేక తల్లడిల్లుతున్న యువతకు ఉపాధి అవకశాలు దక్కుతాయని నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి సమావేశంలో హోరెత్తించారు. పొట్ట చేత పట్టుకొని పరాయి దేశాలకు ఇక యువత పయనమవ్వాల్సిన అవసరం లేదని నేతల మాటలు విన్న యువత ఆశలు అడియాసలు అయ్యాయి. తెలంగాణ వచ్చి రెండు సంవత్సరాలు ముగిసినా వివిధ వర్గాల ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదు.



రాజకీయ నేతల తలరాతలు మారాయే గాని ఆ రాజకీయ నాయకులకు ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పులు కలగలేదు. ముఖ్యంగా ఇంటింటికో ఉద్యోగం లభిస్తుందని ఆస పెట్టిననేతలు వారి నెత్తిమీద టోపీ పెట్టి కూర్చున్నారు. ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే ఉపాధి కోసం గల్ఫ్ దేశాలాకు పయనమవుతున్న యువత తెలంగాణలోనే అత్యధికంగా ఉంటారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక సౌదీ అరేబియా, దుబాయ్‌, కువైట్‌, అబుదాబి, మస్కట్‌ వంటి దేశాలకు పయనమవుతున్నారు.



 వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్లు నిలువునా దోచుకుంటున్నారు. తల తాకట్టుపెట్టి వెళ్లినా కడుపు నిండుతుందనే భరోసా లేదు.. ఒక కంపెనీ పేరుతో వీసాలిచ్చి మరో కంపెనీలో చేరుస్తున్న దుస్థితి.. ఉచిత వీసాలకు సైతం రూ.లక్షకు మించి వసూలుచేస్తూ కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాలలో ఓ పేరున్న ట్రావెల్స్‌ వద్ద నరేందర్‌ అనే సబ్‌ఏజెంటు అందినకాడికి దోచుకుంటున్నాడు. కేవలం రూ.15వేల టికెట్‌ ఖర్చుకు ఒక్కొక్కరి నుంచి రూ.1.25లక్షలు కట్టించుకున్నాడు.


అక్కడికి వెళ్లాక చెప్పిన కంపెనీకి బదులు..సంక్షోభంలో పడిన సంస్థల్లో చేర్చాడు. దీంతో పని చూపించలేక 45 రోజులుగా ఖాళీగా కూర్చున్నారు. ఖర్చులకు కూడా డబ్బులివ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈనెల 16, 17న హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్‌, నాయినిల సమక్షంలో జరగనున్న ఎన్నారైల వర్క్‌షాపులో గల్ఫ్‌ బాధితుల సమస్యను వారి దృష్టికి తీసుకెల్లడానికి సిద్ధంగా ఉన్నారు గల్ఫ్ సంక్షేమ సంఘ నాయకులు. వేలాదిగా తెలంగాణ యువకులు ఏజెంట్లను నమ్మి గల్ఫ్‌ వెళ్లి మోసపోతున్నారు. 



అక్కడ పనిదొరికే పరిస్థితి లేదు. కంపెనీల్లో ఖాళీగా ఉన్నవారిని, జైళ్లలో మగ్గుతున్నవారిని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఏ జైళ్లలో ఎందరు ఉన్నారనే దానిపై ప్రకటన చేయాలి. నకిలీ ఏజెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వారు నేతలకు మొర పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఇక తెలంగాణ నుండి యువత పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వలస వెళ్లడాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని తగ్గించాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది కాబట్టి ఎన్నో కొత్త పరిశ్రమలు స్థాపించడానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయి సంస్థలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారికి ఆయా కంపెనీల్లో తగిన అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: