కనిపెంచిన అమ్మ.. పుట్టి పెరిగిన వూరు.. స్వర్గం కంటే ఎక్కువే.. అందుకే ‘జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ’ అన్నారు. కన్నతల్లి లాంటి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వారు కంకణబద్ధులయ్యారు. సొంత వూరికి మేలు చేయాలన్న తలంపుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
మద్దికెర మాజీ సర్పంచి అర్దగేరి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కూతురు డాక్టర్‌ వెంకమ్మరెడ్డి చదువు పూర్తయిన అనంతరం నెల్లూరు జిల్లా నిడిగుంటపాలేనికి చెందిన డాక్టర్‌ ఎన్‌. ప్రేమసాగరరెడ్డిని వివాహమాడారు. వారిద్దరూ అమెరికాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. అక్కడే అనేక ఆసుపత్రులను నిర్వహిస్తూ ట్రస్టును ఏర్పాటుచేసి వేలాది మందికి విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. ట్రస్టు తరఫున నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేశారు. 



మద్దికెరలో అభివృద్ధి పనులు 
మద్దికెరలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతో పాటు నిడిగుంటపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించారు. ఆమె తనతో పాటు తన సోదరులు లక్ష్మీనారాయణరెడ్డి, సీతారామిరెడ్డిలను అమెరికా తీసుకువెళ్లడంతో పాటు అక్కడే వారికి తమ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. లక్ష్మీనారాయణరెడ్డి ఆసుపత్రులకు సీఈఓగా వ్యవహరిస్తుండగా సీతారామిరెడ్డి రేడియాలజి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో 9 వేల మంది ఉపాధి పొందుతున్నారని డాక్టర్‌ వెంకమ్మ చెప్పారు. 



మద్దికెరలో శుద్ధజల నీటి పథకం 
సగం వ్యాధులు కలుషిత జలాల వల్లనే సంక్రమిస్తాయని భావించిన డాక్టర్‌ వెంకమ్మరెడ్డి తన సోదరులు లక్ష్మీనారాయణరెడ్డి, సీతారామిరెడ్డి, తన అన్న సచివాలయ విశ్రాంత ఉద్యోగి ప్రభాకరరెడ్డిల సహకారంతో గ్రామంలోని మండల పరిషత్‌ కార్యాలయం దగ్గర రూ.12.5 లక్షలతో శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు. స్థానికంగా బీసీ వసతిగృహానికి రూ. 5 లక్షలు, మహిళా భవన నిర్మాణానికి గానూ రూ4 లక్షలు, సిమెంటు రహదారి నిర్మాణానికి రూ.లక్ష, స్థానికంగా సాయిబాబా ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాల కోసం మరో రూ.10 లక్షలు, గ్రామంలో మరో శుద్ధజల కేంద్రం దాని నిర్వహణకు అవసరమైన జనరేటర్‌ కొనుగోలుకు, వాటర్‌షెడ్‌ పథకం కింద ప్రజల తరఫున విరాళంగా మరో రూ.2 లక్షలు అందజేశారు. గ్రామంలో సౌర విద్యుత్తు వీధి దీపాల కోసం వారు విరాళం అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: