అమెరికాలోని ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్‌ అధ్యక్షతన దీనిని నిర్వహించారు. 110 నెలల నుంచి సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని చిన్నారి అనుశ్రీ ప్రార్థనాగీతంతో ప్రారంభించగా, సినీ గాయని నీహారిక రమణీయ గీతాలతో ఆలపించారు.


110వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా తోట నిర్మలారాణి ‘ ఆధునిక కవిత్వం- కొన్ని కవితా రూపాలు, గజల్‌ రచన నియమాలు’ అనే అంశం మీద ప్రసంగించారు. గేయరచయిత, గాయకులు మాట్ల తిరుపతి వేదికపై ప్రసంగించారు. సభ్యులు సింగిరెడ్డి శారద కవితా సంకలనాన్ని సభకు పరిచయం చేశారు. ఈ సంకలనంలోని తనకు నచ్చిన కవితలను మెర్సీ మార్గరెట్‌ చదివి వినిపించి ఈ పుస్తకాన్ని అమెరికాలో సభాముఖంగా ఆవిష్కరించారు. చిన్ని వెంకటేశ్వర తన కుమార్తె అనుశ్రీతో కలిసి పాటలు పాడారు. సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ ‘ సరదాగా కాసేపు ’ ప్రశ్నావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి తోట నిర్మలారాణిని ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం( టాంటెక్స్‌) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం , పాలక మండలి సభ్యులు చాగర్లమూడి సుగన్‌, కార్యక్రమ సమన్వయకర్త బిళ్ల ప్రవీణ్‌ బృంద సభ్యులు శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు వూరిమిండి నరసింహారెడ్డి, కోశాధికారి దండ వెంకట్‌, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి , మాడ దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. సభకు విచ్చేసిన అతిధులకు బిళ్ల ప్రవీణ్‌ కృతజ్ఞతా పూర్వక అభివందనాలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: