తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జల్లికట్టుకు మద్దతుగా అమెరికాలో కూడా తమిళులు ఆందోళన చేస్తున్నారు. వందల సంఖ్యలో తమిళ అమెరికన్లు వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమిళ సంప్రదాయంలో ఒకటైన జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ చేశారు. వర్జీనియాలోని నార్ఫోక్‌లో పెటా హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట తమిళులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు కూడా పెటాకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు.


జల్లికట్టు నిర్వహణపై ఆర్డినెన్స్‌ ఇచ్చినప్పటికీ తమిళులు శాంతించని సంగతి తెలిసిందే. జల్లికట్టు నిర్వహణపై శాశ్వత పరిష్కారం చూపేవరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులు తేల్చిచెప్తున్నారు. తాము జంతువులను ప్రేమిస్తామని, వాటితో ఎలా మెలగాలో తమకు తెలుసని, ఇది తమ సంస్కృతిలో భాగమని వాషింగ్టన్‌లో ఆందోళన చేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి అన్నారు. జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం కావాలన్నారు. ఇటీవల సంవత్సరాల్లో వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ ఎదుట జరిగిన అతి పెద్ద ఆందోళన ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: