జాత్యహంకార దాడులు ఆస్ట్రేలియాకూ వ్యాపించాయి. ఇటీవల అమెరికాలో పలువురు భారతీయులపై విద్వేషపూరిత దాడులు జరిగిన ఘటనలు మరువకముందే ఆస్ట్రేలియాలోనూ అదే తరహా దాడి జరగడం కలవరపెడుతోంది. మెల్‌బోర్న్‌లోని ఓ చర్చిలో భారత సంతతికి చెందిన క్రైస్తవ మతగురువుపై దాడి చేసి గొంతులో పొడిచారు. కేరళలోని కోజికోడ్‌ జిల్లాకు చెందిన టామీ కలథూర్‌ మాథ్యూ(48) మెల్‌బోర్న్‌ శివారు ఫాకనర్‌ ప్రాంతంలోని సెయింట్‌ మాథ్యూస్‌ చర్చిలో ఆదివారం ప్రార్థనలు చేయిస్తుండగా ఈ ఘటన జరిగింది.



చర్చిలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారి ముందే దుండగుడు దాడి చేశాడు. ‘నువ్వు భారతీయుడివి. హిందువు లేదా ముస్లింవి. నువ్వు ప్రార్థన చేయించడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా’ అని అరుస్తూ దుండగులు కత్తితో మాథ్యూ దగ్గరికి వచ్చి పొడిచాడు. కొంతమంది అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. మాథ్యూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.ప్రార్థన సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్నందున.. మెడ చుట్టూ మందపాటి వస్త్రం ఉండటంతో కత్తి లోపలికి దిగలేదని చెప్పారు. పోలీసులు 72ఏళ్ల దుండగుడిని ఆదివారం రాత్రి అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అతడు ఇటాలియన్‌ సంతతికి చెందినవాడుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: