అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాదిలో 6,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 2.3 శాతానికి సమానం. ఆటోమేషన్‌ కారణంగానే దిగు వ స్థాయిలో ఉన్న ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆటోమేషన్‌ కారణంగా ఐటి రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వార్షిక మూల్యాంకనంలో భాగంగా పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించడం సాధారణమేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.




కానీ ఈ ఏడాది మాత్రం ఎక్కువగా ఉద్యోగులను తొలగిస్తుండటం ఆందోళనకర మని ఈ పరిణామంతో సంబంధం ఉన్నవర్గాలు చెబుతున్నాయి. గత ఏడాదిలో కాగ్నిజెంట్‌ 1-2 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. రెండేళ్ల క్రితం ఒక శాతం మందిని తీసివేసింది. గత డిసెంబర్‌ చివరినాటికి కాగ్నిజెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 2,60,200 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మంది భారతలోనే పని చేస్తున్నారు. కాగా ఈ ఏడాది కంపెనీ ఉద్వాసన చెప్పే ఉద్యోగుల్లో భారతలో పనిచేస్తున్నవారి సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై స్పష్టతరాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: