అమెరికాలో విద్వేష దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూయార్క్‌ లో సిక్కు క్యాబ్‌ డ్రైవర్‌ విద్వేష దాడికి గురయ్యాడు. హరకీరత్‌ సింగ్‌(25) అనే సిక్కు యువకుడిపై నలుగురు ప్రయాణికులు దాడి చేశారు. అతడి తలపాగాను ఎత్తుకెళ్లారు. దుర్భాషలాడుతూ అతడిపై చెప్పులు విసిరారు.చిత్తుగా తాగివున్న ప్రయాణికుడితో పాటు మరో ముగ్గురు తన కారులో ఎక్కారని బాధితుడు తెలిపాడు. కారులో ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో సరిగ్గా చెప్పకుండా తనను తిట్టడం మొదలు పెట్టారని వాపోయాడు.


అమెరికాలో మరో విద్వేష దాడి

తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వారిలో ఒకడు చేతిపై దాడి చేశాడని తెలిపాడు. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే తలపాగాను ఊడదీసి ఎత్తుకెళ్లారని పోలీసులతో చెప్పాడు. ఈ ఘటనపై న్యూయార్క్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దాడి జరిగినప్పటి నుంచి పనిచేయడానికి తనకు భయం వేస్తోందని హరకీరత్‌  సింగ్‌ అన్నాడు. రాత్రి వేళలో డ్రైవింగ్‌ చేయాలంటే వణుకు వస్తోందని వాపోయాడు. తన మతానికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడి జరగడానికి వారం రోజుల ముందే వి​ద్వేష దాడులకు వ్యతిరేకంగా ప్రవాస సిక్కులు ప్రచారం నిర్వహించారు. అమెరికాలో ఇటీవల కాలంలో భారతీయుల పట్ల వరుసగా విద్వేష దాడులు జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: