ప్రముఖ రచయిత, పద్మభూషణ్‌ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నాట్స్‌ సేవాసమితి, లయోలా కళాశాల పూర్వవిద్యార్థులు ఘనంగా సత్కరించారు. అమెరికాలోని డెట్రాయిట్‌నగరంలోని ఐలాండ్‌ లేక్స్‌ ఆఫ్‌ నోవి సమావేశ మందిరంలో నాట్స్‌ ఆధ్వర్యంలో తెలుగు సాహితీవేత్తల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అనేక మంది సాహితీ అభిమానులు, తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పూర్వ విద్యార్థి, నాట్స్‌ నాయకుడు శ్రీని కొడాలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు, గుంటూరు ఎన్‌.ఆర్‌.ఐ. వైద్య కళాశాల అధ్యక్షులు డా.ముక్కామల అప్పారావు, కాట్రగడ్డ నరసింహారావు చేతుల మీదుగా యార్లగడ్డను సత్కరించారు.



ఈ సందర్భంగా డా.ముక్కామల అప్పారావు మాట్లాడుతూ యార్లగడ్డతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి, అకుంఠిత దీక్షతో సాహితీ సేవ ద్వారా పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న విధానాన్ని ఆయన వివరించారు. లక్ష్మీప్రసాద్‌ తెలుగు, హిందీ భాషలకు చేసిన సేవలను, ఆయన రచనలను తానా మాజీ అధ్యక్షులు డా.బండ్ల హనుమయ్య చౌదరి వివరించారు. అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ తన శిష్యులు ప్రపంచంలో అన్ని దేశాలల్లో ఉన్నారని, వారి ప్రగతిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటోందని అన్నారు. తెలుగులో ఎంతో మంది కవులు, రచయితలు ఉన్నా తనకు దక్కిన గౌరవాన్ని భగవంతుడి వరంగా భావిస్తానని ఆయన చెప్పారు. నాట్స్‌ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: