ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా పూర్వ ఐపీఎస్‌ అధికారి మణిపూర్‌ గవర్నర్‌ వీకే దుగ్గల్‌ను నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌పై అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం గవర్నర్‌ను బుధవారం ప్రశ్నించింది. అగస్టా హెలికాప్టర్లలో కీలకమైన సాంకేతిక మార్పులకు 2005, మార్చిలో ఉన్నత స్థాయి సమావేశం అనుమతించింది. టెండర్లలో పేర్కొన్న అర్హతలకన్నా తక్కువ సాంకేతిక పరిజ్ఞానానికి ఆ సమావేశం ఆమోదం తెలిపింది. అయితే ఈ కమిటీలో పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ ఏకే నారాయణన్‌, గోవా గవర్నర్‌ బీవీ వాంఛు కూడా ఉండడంతో వారినీ సీబీఐ విచారించింది. వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. నరసింహన్‌ గవర్నర్‌ పదవినుంచి తప్పుకోక తప్పదని సర్వత్రా వినవస్తున్న నేపధ్యంలో గవర్నర్లుగా పని చేస్తూ ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పదవుల నుండి తప్పుకున్న వారిలో నరసింహన్‌ మూడవ వారు అవుతారు. అప్పట్లో జాతీయ భద్రతా సలహాదారుగా ఏకే నారాయణన్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) చీఫ్‌గా బీవీ వాంఛు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా నరసింహన్‌ ఉన్నారు. నరసింహన్‌కు ఖచ్చితంగా పదవీ గండం ఉందనే వార్తల నేపధ్యంలో అగస్టా కుంభకోణంలో ఆయన పాత్రపై ఆరోపణలు రావడంతో స్వచ్ఛందంగా ఆయనే పదవి నుంచి తప్పుకోవాలని భావించడంతో కేంద్ర ప్రభుత్వం పని సులువైంది. నరసింహన్‌ స్థానంలో మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీకే దుగ్గల్‌ను నియమించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం మణిపూర్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 2005 మార్చి నుంచి 2007 వరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పని చేశారు. గతంలో చండీగఢ్‌ సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన కొంత కాలం సైనిక సేవలు కూడా అందించారు. 1996 నుండి 2000 వరకు ఢిల్లి మునిసిపల్‌ కమిషనర్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన జరగకముందు కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించారు. అప్పట్లో రాష్ట్రం మొత్తం పర్యటించి విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. రాష్ట్రంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా ఆయన ఈ విషయాలపై కొంత అధ్యయనం కూడా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తుండడంతో సమర్ధుడైన వ్యక్తి కోసం ఎన్డీయే ప్రభుత్వం అన్వేషించింది. పూర్వ పోలీసు అధికారి అయిన దుగ్గల్‌ను ఉభయ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరని భావించిన కేంద్రం ఆయనను ఇక్కడ నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 26, 1944లో జన్మించిన దుగ్గల్‌కు రాష్ట్ర విభజనానంతర సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: