ఆర్థిక విధానాల విషయంలో యుపిఎ ప్రభుత్వానికి, ఎన్‌డిఎ ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం లేదని సిపిఐ ఎంపి అచ్యుతన్‌ విమర్శించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం యుపిఎ-3 ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలపై రాజ్యసభలో జరిగిన చర్చలో అచ్యుతన్‌ బుధవారం పాల్గొన్నారు. సమస్యల పట్ల ఎన్‌డిఎ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. సామాన్య ప్రజల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. ధరల పెరుగుదల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. ప్రతి సమస్యపై మన ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్‌ చేస్తుంటారని, అయితే ధరల పెరుగుదలపై ఒక్క మాట మాట్లాడటం లేదని సిపిఐ సభ్యులు విమర్శించారు. ధరల పెరుగుదల సామాన్యులపై పెను ప్రభావం చూపుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆర్థిక విధానాలు పరిశీలిస్తే ఎన్‌డిఎ ప్రభుత్వం యుపిఎ-3 ప్రభుత్వంగా మారినట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. యుపిఎ ఆర్థిక విధా నాలనే మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ఫలితంగా నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ఇప్పటికీ మంచి రోజులు వస్తాయనే ప్రభుత్వం చెబుతుందని పేర్కొన్నారు. ఎవరికి మంచి రోజులు వస్తాయని ప్రశ్నించారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, బడా వ్యాపార, వాణిజ్యవేత్తలకు మాత్రమే మంచి రోజులు వస్తాయని అచ్యుతన్‌ నిశితంగా విమర్శించారు. చక్కెర ధరను ఉదాహరణగా తీసుకుందాం. కిలో చక్కెర ధర ఈ కొద్దికాలంలోనే ఐదు రూపాయలు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం మిల్లు యజమానులకు రూ.4,600 కోట్లు గ్రాంట్‌గా ఇచ్చింది. దీనితో పాటు ఎగుమతి సబ్సిడీ కూడా ఇచ్చింది. ఇప్పటికీ చెరకు ఉత్పత్తిదారులు, వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఇతర రంగాల విషయంలోనూ ఇంతకన్నా మెరుగైన పరిస్థితులేమీ కనిపించడం లేదు. ప్రతినెలా డీజిల్‌పై 50 పైసలు పెంచడానికి యుపిఎ ప్రభుత్వం అనుమతిచ్చింది. మోడీ ప్రభుత్వం కూడా ఇదే విధానం అనుసరిస్తున్నది. అదేమంటే...ప్రభుత్వరంగ చమురు సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని ప్రభుత్వం చెబుతుందని అచ్యుతన్‌ దుయ్యబట్టారు. ప్రభుత్వాలు ఇలా చెబుతుంటే... భారతదేశంలోని ప్రభుత్వరంగ చమురు సంస్థలు గత ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల లాభాలు ఆర్జించాయని ఇటీవల కాగ్‌ తన ముసాయిదా నివేదికలో పేర్కొన్న విషయాన్ని అచ్యుతన్‌ వెల్లడించారు. ఈ విషయం మీడియాలో ప్రచారమైందన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నష్టాల గురించే మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. పెట్రోలుపై నియంత్రణ ఎత్తివేయాలని మీరు కోరుకుంటున్నారా? దీనితో పాటు ఎల్‌పిజి, కిరోసిన్‌ ధరలు పెంచుతున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. ధరలు తగ్గించాలని కోరుకుంటే తక్షణమే మీ ఆర్థిక విధానాలు మార్చుకోవాలని మోడీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. ధరలు అదుపు చేయాలని, అక్రమ నిల్వలను వెలికితీయాలని, బ్లాక్‌ మార్కెటీర్లపై చర్యలకు వెనకాడరాదని సిపిఐ నాయకులు ఎన్‌డిఎ ప్రభుత్వానికి సూచించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వజనీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మిమ్ములను నమ్మారు. ఓటు వేశారు. మార్పు కోసమే ప్రజలు మీకు ఓటు వేసిన విషయాన్ని విస్మరించరాదు. ఆ మార్పు ఆర్ధిక విధానాలలో తీసుకువస్తే మంచిదన్నారు. విధానాలు మార్చుకోకపోతే ఎన్‌డిఎకు కూడా యుపిఎకు పట్టిన గతే పడుతుందని అచ్యుతన్‌ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: