తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో బెంబేలెత్తిపోయిన సీమాంధ్ర ఎంపీలు.. కేంద్రాన్ని శరణజొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలు చేపడుతోందని ఫిర్యాదు చేశారు. దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన వారిలో అభద్రతాభావాన్ని పెంపొందిస్తోందని సీమాంధ్రకు చెందిన ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసి విజ్ఞప్తి చేశారు. రాజధానిలో సీమాంధ్ర ప్రజలు... తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛ కాపాడే విషయంలో వివక్ష చూపుతోందని బలంగా నమ్ముతున్నారని.. ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయనకు వివరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లు 2014 చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదిస్తూ.. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. వీరి సమావేశం ఆసక్తికరంగా మారింది. చట్టంలోని 8 వ నిబంధన ప్రకారం.. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో అధికారాలన్నీ గవర్నర్ కు కట్టబెట్టాలని ఎంపీలు రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. ఇది ఇప్పటికే చట్టంలో ఉన్న అంశమేనని.. దీనికి కొత్తగా సవరణలు అవసరం లేదని.. నిబంధనలు రూపొందిస్తే సరిపోతుందని వారు హోంమంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయే 7 మండలాలతో పాటు బూర్గంపాటు రెవెన్యూ గ్రామాన్ని కూడా సీమాంధ్రలో కలిపేలా బిల్లులో పొందుపరచాలని ఎంపీలు రాజ్ నాథ్ సింగ్ కు సూచించారు. ప్రస్తుతం బూర్గంపాడు రెవెన్యూ గ్రామం తెలంగాణలోనే ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ గ్రామం కూడా మునగడం ఖాయం. వేరే రాష్ట్రంలో ఉండటం వల్ల.. పరిహారం చెల్లింపు ఇతర సహాయ చర్యలు వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ఉపయోగించుకుని సీమాంధ్రను ఇరుకునపెట్టే అవకాశమూ ఉంది. అందుకే సవరణల్లో బూర్గంపాడును కూడా ఆంధ్రలో కలిపేలా ప్రతిపాదించాలని ఎంపీలు గట్టిగా కోరారు. రాజ్ నాథ్ సింగ్ ను 12మంది వరకూ తెదేపా ఎంపీలు, విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు కలిశారు. వీరి వాదనలను ఆసక్తిగా విన్న సింగు గారు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారట. చివరకు పార్లమెంటులో ఏం చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: