నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలంగాణను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న అంశాలపై సైతం బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు. కేంద్రం హోంమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు తెలంగాణ బిజెపి నాయకులను సైతం ఈ బడ్జెట్ విస్మయపరిచింది. కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యాన వన విశ్వవిద్యాలయం మినహా మరేదీ తెలంగాణ కోసం కొత్తగా కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటుపై ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో స్పందించారు. ఉద్యాన వన విశ్వవిద్యాలయం సైతం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరిచిందేనని, అంతకు మించి కేంద్రం కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని కేసిఆర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంతో కోరామని , కానీ కేంద్రం తెలంగాణకు బడ్జెట్‌లో న్యాయం చేయలేదని కేసిఆర్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరిచిన అంశాలకు కేంద్రం కట్టుబడి ఉందని మాటలు మాత్రమే చెప్పారు తప్ప, ఏ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదని అన్నారు.తెలంగాణ బిజెపి నాయకుల బృందం ఇటీవల పలువురు కేంద్ర మంత్రులకు తెలంగాణలోని ప్రధానమైన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి పట్ల సానుకూలంగా స్పందించారని, తాము అడిగిన అనేక డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర మంత్రులు ఆసక్తి చూపించారని బిజెపి తెంలగాణ నాయకులు సగర్వంగా ప్రకటించారు. తీరా బడ్జెట్‌లో తెలంగాణకు ఉద్యాన వన విశ్వవిద్యాలయం తప్ప ఏమీ లేకపోవడం బిజెపి నాయకులకు సైతం మింగుడు పడడం లేదు. ఎన్‌డిఏ మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదు, రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి చూపించారు. ఇప్పుడు సాధారణ బడ్జెట్‌లో సైతం తెలంగాణను చిన్నచూపు చూడడం తెలంగాణ వారికి మింగుడు పడని విషయం. పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న అన్ని అంశాలను అమలుకు కృషి చేస్తామనే మాట తప్ప వాటి అమలుకు స్పష్టమై కార్యాచరణ ప్రకటించక పోవడం పట్ల తెలంగాణ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత యుపిఏ ప్రభుత్వం ఐటిఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌కు కేటాయించింది, ఈ ప్రాజెక్టుపై ఎన్‌డిఏ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేసినట్టుగానే తెలంగాణకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. బడ్జెట్‌లో దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం వివిధ విషయాలపై ఆశలు పెట్టుకొంది అయితే కేంద్రం మాత్రం నూతనంగా ఆవిర్భవించిన రాష్ట్రం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఏర్పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: