ఫీజు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న నిబంధనలు నిబంధనల్లో సడలింపునకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అనడమేగాక, గతంలో ప్రతిపాదించిన రీతిలోనే జీవో సిద్ధం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తోంది. జీవో విడుదల అయిన మరుక్షణం పిటీషన్ దాఖలు చేసేందుకు వీలుగా న్యాయబృందాన్ని కూడా సిద్ధం చేసింది. జీవోను విడుదల చేసిన వెంటనే దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉత్తర్వులను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే రీయింబర్స్‌మెంట్ విషయంలో చేర్చే నిబంధనలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వెల్లడి చేయడంతో అవి ఏ విధంగానూ న్యాయస్థానం ముందు నిలవవని ఆంధ్రా ప్రభుత్వం అంటోంది. దీనిపై అడ్వకేట్ జనరల్‌తోనూ, ఇతర న్యాయనిపుణలతోనూ ఇప్పటికే హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. పలు సభల్లో పాల్గొన్న ప్రతిసారీ గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రాంత విద్యార్ధులకు అన్యాయం చేయాలని చూడటం సరికాదని మాట్లాడటం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరకపోగా, అది మరింత రాద్దాంతానికి దారి తీసింది. గురువారం రీయింబర్స్‌మెంట్ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఏ క్షణమైనా వాటిని విడుదల చేయాలని చూసినా వాటిని శుక్రవారం రాత్రి విడుదల చేయాలని అధికారులు సూచించినట్టు సమాచారం. తొలుత స్థానికతపైనే స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలని అనుకున్నా, అవి న్యాయస్థానం ముందు నిలవవని అధికారులు చెప్పడంతో రీయింబర్స్‌మెంట్‌లో కావల్సిన నిబంధనలను చేర్చుకునే వీలుందని ప్రభుత్వం భావించింది. 1958 కంటే ముందు తెలంగాణలో నివసించిన వారి కుటుంబ సభ్యులకు మాత్రమే స్థానికత వర్తిస్తుందని ఇస్తున్న నిర్వచనం ఏ విధంగానూ చెల్లదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావించారు.  ఈ మేరకు అవసరమైతే తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి, ముఖ్యమంత్రికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న విద్యార్ధులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు నాన్ లోకల్ అభ్యర్ధులుగా ఉన్నారు. వారిని తెలంగాణ ప్రభుత్వం సైతం నాన్‌లోకల్‌గా గుర్తిస్తే వారి పరిస్థితి ఏమిటన్నది మంత్రిమండలి సమావేశంలో తీవ్రంగా చర్చించారు. రీయింబర్స్‌మెంట్ నిబంధనలు అక్కడికే పరిమితం కాబోవని, రానున్న రోజుల్లో ఉద్యోగాల నియామకాల్లో కూడా వర్తింపచేస్తే ఒక తరానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించినట్టు సమాచారం. ఈ క్రమంలో రీయింబర్స్‌మెంట్ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహచర మంత్రులతో పేర్కొన్నట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: