రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజుల పూర్తిచేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం దూకుడు పెంచాలని నిర్ణయించంది. మంత్రివర్గం సమావేశమై.. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. బోధనా ఫీజులు చెల్లింపు విషయంలో రగులుతున్న వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చంద్రబాబు లేఖ రాయాలని నిర్ణయించారు. గవర్నర్‌కూ తెలిపి వివాద పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరనున్నారు. మంత్రివర్గం... వచ్చే 15ఏళ్లలో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మిషన్ 2029లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. అభివృద్ధే ధ్యేయంగా మంత్రివర్గ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7మిషన్ల ద్వారా సమగ్రాభివృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించింది. సాంఘిక, సేవా, ప్రాథమిక, వృత్తినైపుణ్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈ మిషన్లు పనిచేయనున్నాయి. అవినీతి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా మిషన్ 2029 పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపైనా మంత్రివర్గం చర్చించింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన 3వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయించింది. ఆదర్శరైతుల స్థానంలో ఎంపీఈవోలను నియమించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 24గంటలు నిరంతరాయంగా గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్‌ను సరఫరా అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. బొగ్గు నిల్వలు లక్ష44వేల మెట్రిక్ టన్నులు నుంచి 2లక్షల 9వేల మెట్రిక్ టన్నులకు చేరుకోవటం ఆశాజనకంగా ఉందని తెలిపింది . కాకినాడ వద్ద ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజ్ టెర్మినల్ ను నిర్మించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు వల్ల 1700కోట్ల ఆదాయ రాబడితోపాటు 2వేల మందికి ఉపాధి లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: