మంచి రోజులు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ ద్వారా ప్రజలకు మరింత దుర్భరమైన రోజులు తేవడానికి కసరత్తు ప్రారంభించిందని సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. సంపన్నులకు రాయితీలు, పేదలపై భారాలు అన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాన్నే బిజెపి ప్రభుత్వమూ అనుసరించనుందని బడ్జెట్‌ సుస్పష్టంగా పేర్కొందని గురువారం ఆయనిక్కడ విలేకరులతో అన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగాలకు మోడీ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే 2 లక్షల కోట్ల రూపాయల మేర కోత విధించిందని ఆయన వివరించారు. ' వ్యవసాయానికి గత బడ్జెట్‌లో 18781 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో 11531 కోట్లు మాత్రమే కేటాయించారు. గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌ను నమ్మడానికి వీలులేనంతగా 56438 కోట్ల రూపాయల నుండి 3082 కోట్లకు కుదించారు. సామాజిక రంగాలకు కేటాయింపులను 193043 కోట్ల రూపాయల నుండి 113633 కోట్లకు తగ్గించారు. మొత్తంగా కీలక రంగాలకు 2 లక్షల కోట్ల రూపాయల మేర కోత విధించారు. ఈ స్థాయిలో కోతలు విధిస్తున్న నేపథ్యంలోనే వచ్చే రెండేళ్లలో ద్రవ్యలోటును 3 శాతానికి తీసుకు వస్తామని జైట్లీ చెబుతున్నారు ' అని ఏచూరి పేర్కొన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ నిధులు తగ్గితే ఆ మేరకు దేశంలో ఉపాధీ తగ్గిపోతుందన్నారు. ఫలితంగా ప్రజల కొనగోలు శక్తి తగ్గి దేశీయ డిమాండ్‌ క్షీణిస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎఫ్‌డిఐలు, పిపిపిలను ఎంతగా ప్రోత్సహించినా కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పెక్యులేటివ్‌ వ్యాపారాలు మాత్రమే పెరుగుతాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి పేదలపై మరింత భారాలు పడతాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్‌ సంస్థలు చేసిన సహకారానికి బడ్జెట్‌ రూపంలో ప్రధాని మోడీ రుణం తీర్చుకున్నారని ఏచూరి వ్యాఖ్యానించారు. ఇన్సూరెన్స్‌, రక్షణ రంగాల్లో ఎఫ్‌డిఐ పరిమితిని 49 శాతానికి పెంచడం, బ్యాంకింగ్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించడం దీనికే నిదర్శనమన్నారు.  ప్రస్తుత బడ్జెట్‌లో సంపన్నులపై వేసే ప్రత్యక్ష పన్నులను 22 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారని, పేదలపై భారాలు మోపే పరోక్ష పన్నులను ఏడున్నర వేల కోట్ల రూపాయల మేర పెంచారని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తరహాలోనే బిజెపి ప్రభుత్వం కూడా సంపన్నులకు రాయితీలిచ్చి, పేదలపై భారాలకు సిద్ధపడుతోందనడానికి ఇదే తార్కాణమన్నారు. పెట్రో ఉత్పత్తులు, ఎరువులు, ఆహార ధాన్యాల సబ్సిడీలను క్రమబద్ధీకరించే పేరుతో భారీగా సబ్సిడీల కోతకు ప్రభుత్వం సిద్ధపడుతుందన్నారు. అందరికీ ఆహారం, అందరికీ వైద్యం అన్న నినాదాల స్థానంలో కొందరికే ఆహారం, కొందరికే వైద్యం అన్న రీతిలో బిజెపి ప్రభుత్వం సబ్సిడీలపై దాడిని ప్రారంభించిందని విమర్శించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక విధానాల వల్ల దేశంలో అటు వృద్ధి, ఇటు పేదల సంక్షేమం రెండూ సాధ్యం కావని ఏచూరి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: