తాము అధికారంలోకి వస్తే తాము చేస్తామని చెప్పినది వేరు, తీరా అధికారం చేతిలోకి అందాకా తెలుగుదేశం వాళ్లు చేస్తున్నది వేరు. ఇది అందరికీ అర్థమైన విషయమే! రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి అంశాలే కీలకంగా పనిచేసి అధికారాన్ని చేజిక్కించుకొన్న తెలుగుదేశం పార్టీ అధికారం చేతికందిన తర్వాత కూడా ఇంకా వాటిపై అధ్యయనం చేస్తున్నామనే చెబుతోంది. ప్రభుత్వం ఈ విధంగా అధ్యయనం చేస్తూ ఉండగానే.. మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చింది. రైతులు ఈ ఏడాది రుణాలపై వడ్డీలు కట్టింది లేదు. ప్రతి యేటా జూన్ జూలైలో వడ్డీలు చెల్లించి రుణాలను రెన్యువల్ చేసే రైతులు ఈ సారి మాఫీ హామీతో బ్యాంకుల వైపుకు వెళ్లలేదు. ఇది ఒక అంశం అనుకొంటే.. మరోవైపు దాదాపు మూడు నెలలుగా రాష్ట్రంలోని ఏ డ్వాక్రా సంఘం కూడా రుణాలను చెల్లించడం లేదు. మాఫీ అయిపోతాయనే ధీమాతో నెల నెలా నిక్కచ్చిగా రుణాలను చెల్లించే మహిళలలు కూడా ఇప్పుడు కట్టకుండా ధీమాగా ఉన్నారు! అయితే ఈ వ్యవహారాల గురించి సామాన్య ప్రజల్లో ఆందోళన అధికరం అయ్యింది. అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరి ఇదే సమయంలో మేధావులను ఇలాంటి అంశాల గురించి ఆలోచించకుండా, మీడియాలో ఈ అంశం గురించి చర్చ జరగనీయకుండా ప్రభుత్వం ఒక తెలివైన ప్రయత్నం చేసింది. అదే శ్వేతపత్రం! గత ప్రభుత్వ తీరు తెన్నుల గురించి శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా.. వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందని, దాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నామని తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శ్వేత పత్రాల విడుదలకు పూనుకొన్నాడు. విడుదల చేశాడు కూడా.. అయితే ఇప్పుడు వాటిపై అంతగా చర్చ జరగలేదని ప్రభుత్వంలోని పెద్దలు బాధపడుతున్నారట. పదేళ్ల పాటు అధికారంలో ఉండిన కాంగ్రెస్ ను ఇరుకునపెట్టడానికి, వైఎస్ వంటి వాళ్లపై కొత్త అభియోగాలు మోపడానికి ఈ శ్వేత పత్రాలు ఉపయోగడపతాయని తెలుగుదేశం భావించిందట. అయితే.. ఇప్పుడు అది జరగడం లేదని, శ్వేతపత్రాల ఎత్తు పనికిరాకుండా పోయిందని, ప్రజలు తాము ఇచ్చిన హామీల గురించి ఆలోచిస్తున్నారు తప్ప.. ఇలాంటి తప్పొప్పులను ఎంచడంపై వాళ్లకు పెద్దగా ఆసక్తి లేదని ప్రభుత్వం గుర్తించిందట. ఈ మేరకు ఒక రియలైజేషన్ వచ్చిందని బోగట్టా. దీంతో మరిన్ని శ్వేత పత్రాలు విడుదల చేసే ఆలోచనను మానుకొంటున్నారట. ఇంతటితో ఈ పత్రాల గొడవకు సెలవిద్దామని అనుకొంటున్నారట!

మరింత సమాచారం తెలుసుకోండి: