లోక్ సభలో రాహుల్ గాంధీ నిద్రపోయిన విషయం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా సాగింది. ఈనెల 9 న సభలో ధరల పెరుగుదల పై చర్చ జరుగుతుండగా... రాహుల్ కునుకు తీసిన దృశ్యాలు వీడియోలో దర్శనమిచ్చాయి. ఇదే అదునుగా అధికారపక్షం నేతలు రాహుల్ పై విమర్శల వర్షం కురిపించారు. దీన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావనుకోండి. అది నిద్ర కాదని... మౌన ముద్ర అని కొందరు వర్ణిస్తే... అలా నిద్రిస్తున్నట్లుగా వినడం వాజ్ పేయి కూాడ చేసేవారని మరికొందరు వివరించారు. మూడు రోజులుగా ఆసక్తిగా సాగుతున్న ఈ అంశం పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో ఇతర పార్టీల ప్రధాన మంత్రులే నిద్రపోయారని విమర్శించారు. అంతకుముందు రోజు రాత్రి ఫుట్ బాల్ మ్యాచ్ చూడడమో, మరే ఇతర కారణం వల్లనో నిద్ర తక్కువై ఉంటుందని డీ శ్రీనివాస్ వివరించారు. మొత్తానికి రాహుల్ గాంధీ లోక్ సభలో నిద్రపోయాడని ధృవీకరించిన డీఎస్... ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయో... లేవో... అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. వద్దంటే రాత్రిళ్లు చోటా భీమ్ చూసి, సభలో నిద్రపోతున్నావని రాహుల్ ను సోనియా మందలిస్తున్నట్లు ఇప్పటికే కార్టూన్లు కోకొల్లలుగా వెలిసాయి. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మాటలు సైతం అలాంటి సూటి విమర్శలనే తలపిస్తున్నాయి. అధిష్టానం మెప్పు కోసమే డీఎస్ మాట్లాడి ఉన్నారేమో కానీ... వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం ఢిల్లీ పెద్దలు ఆగ్రహించక తప్పరు. రాహుల్ సభలో నిద్రపోయారని ధృవీకరించడంతోపాటు... తమ నాయకుడికే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని గట్టిగా చెప్పలేక కాలానికి వదిలేయడం కామెడీ కాకపోతే మరేమిటి...

మరింత సమాచారం తెలుసుకోండి: