పార్టీలు ప్రజలను మోసం చేస్తాయి.. ప్రజలు తమ ఓటు ద్వారా ఐదేళ్ల తర్వాత ఆ పార్టీలపై ప్రతీకారం తీర్చుకొంటారు. అంతకు మించి ప్రజలు ఏమీ చేయలేరు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలపై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం దక్కింది. తాము తెలంగాణప్రజల ఆకాంక్షల మేరకు వ్యవహరించినా.. ప్రజలు ఆదరించకపోవడంతో.. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం దక్కింది ఆ పార్టీకి! ఇది పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం వ్యవహారం. ఇందుకు సంబంధించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ వాళ్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గకుండా పోలవరం ముంపుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది. ఇక ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదంపొందాల్సి ఉంది! అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో బలం లేదు. ఇక్కడ మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ వాళ్లున్నారు. దీంతో ఈ బిల్లుకు కాంగ్రెస్ గనుక బలంగా అడ్డుపడితే ఆగిపోయే అవకాశం ఉంది! దీంతో తెలంగాణ జేఏసీ నేతలు మళ్లీ కాంగ్రెస్ మీద పడ్డారు. కాంగ్రెస్ పోలవరం బిల్లును అడ్డుకోవాలని అంటున్నారు. అయితే జేఏసీ నేతల బెదిరింపులపై కాంగ్రెస్ వాళ్లు మండిపడుతున్నారు. అసలు తెలంగాణ కు ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చిందే తమ వల్లనని, కానీ ఎన్నికల్లో తమను ఎవరూ పట్టించుకోలేదని.. సీమాంధ్రలో పార్టీని పణంగా పెట్టి విభజనకు అనుకూలంగా నిలబడితే చివరకు తమకు దక్కింది ఏమిటని కాంగ్రెస్ నేతలు జేఏసీ వాళ్లను ప్రశ్నిస్తున్నారు! ఇప్పుడు మరోసారి తెలంగాణకు అనకూలంగా నిలబడటం వల్ల తమకు దక్కేది ఏమిటని? ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి ఉంటే.. ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని ఆ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఇలా మాట్లాడటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదని చెప్పవచ్చు. మరి అవకాశం ఉంది కాబట్టి.. పోలవరం బిల్లుకు అనుకూలంగా నిలబడి తెలంగాణ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవచ్చు! సీమాంధ్రకు అనుకూలంగా నిలబడ్డామని ప్రచారం చేసుకోవచ్చు. మరి కాంగ్రెస్ కు అంత సత్తా ఉందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: