సీమాంధ్ర రాజధాని కోసం మరో కమిటీ ఏర్పాటు కాబోతోంది. నిధులు ఎలా సమీకరించాలన్న విషయంపై ఈ కమిటీ పని చేస్తుంది. నిధుల సేకరణపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. ఈ కమిటీకి టీడీపీ ఎంపీ, చంద్రబాబు సన్నిహితుడుగా పేరున్న సుజనాచౌదరిని.. దీనికి అధ్యక్షుడిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలో ఆర్థిక రంగ నిపుణులకు స్థానం కల్పిస్తారు. కెనరా బ్యాంకు మజీ సీఎండీ ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. రాజధాని నిర్మాణంలో నిధుల సమీకరణది కీలకపాత్ర అన్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాబట్టుకోవడం.. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణపై సలహాలివ్వడం, రాజధాని ఏర్పాటు కోసం ఎంత నిధులు అవసరమన్న అంశాలను అధ్యయనం చేయడం దీని పని. సీమాంధ్ర రాజధాని కోసం ఇప్పటికే రెండు కమిటీలు ఏర్పడ్డాయి. రాజధాని అధ్యయనం కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఒకటి. కొత్తగా.. ఈ మధ్య పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో.. రాజధాని రూపురేఖల కమిటీ ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటు కాబోతున్నది మూడో కమిటీ అన్నమాట. శివరామకృష్ణన్ కమిటీ ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించింది. అనేక ప్రాంతాల అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసింది. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉన్న కృష్ణా-గుంటూరు జిల్లాల్లోనే వస్తుందన్న సంగతి బహిరంగ రహస్యమే. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పింది. తాజాగా.. శివరామకృష్ణన్ కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ను.. రాజధాని రూపురేఖల కమిటీ అధ్యక్షుడు నారాయణ ఢిల్లీలో కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రాజధానిని నడిబొడ్డునే ఉండాలని సూచించినట్టు నారాయణ చెప్పారు. ఉత్తరాంధ్రలో పెడితే.. సీమకు.. సీమలో పెడితే ఉత్తరాంధ్రకు రాజధాని దూరమవుతుందని.. అందుకే కృష్ణా-గుంటూరు ప్రాంతాన్ని సూచిస్తున్నామని ఆయన వివరించారు. ఇన్ని విషయాలు మాట్లాడిన నారాయణ.. రాజధానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని జలక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: