సీఎం చంద్రబాబు.. సీమాంధ్ర అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్నారు. ఆయన మదిలో కొత్త కొత్త ప్రాజెక్టులు ఆలోచనలు బోలెడున్నాయ్.. ఆయన ఇప్పటికే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తానని మాట కూడా ఇచ్చారు. కొత్త రాజధాని గురించి.. అందులో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల గురించి ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తీసుకున్న రాజధాని ఏర్పాటు నిర్ణయం కొందరిని ఇబ్బందిపెట్టక తప్పదు. ఇప్పటికే గుంటూరు-కృష్ణా జిల్లాల్లో రాజధాని వస్తుందని తేల్చి చెప్పేశారు. ఈ విషయంలో పార్టీలోనూ పెద్దగా ఎవరికీ అనుమానాలు లేవు.. విజయవాడ-గుంటూరు రాజధాని ప్రతిపాదన రాక ముందు.. రాజధాని రేసులో ఒంగోలు చాలా ముందుండేది. అసలు సమైక్య రాష్ట్రం విడిపోతుందో.. లేదో తెలియక ముందే ఒంగోలులో భూమి భూమ్ మొదలైంది. క్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పుడు అది రాజధాని కాదని తేలిపోయాక.. ఆ జిల్లా నాయకులు నిరాశ చెందారు. అందుకే వారిని బుజ్జగించేందుకు జిల్లాకే చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ప్రయత్నిస్తున్నారు. రాజధాని రేసులో ముందునుంచి ఒంగోలు ఉండటానికి కారణం అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉండటమే. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద దాదాపు 60వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. రాజధాని ఏర్పాటు చేయకపోయినా.. ఈ ప్రభుత్వ భూములను చంద్రబాబు సద్వినియోగం చేస్తారని..వీటికోసం కొత్త ప్రాజెక్టులు తెస్తారని శిద్దా రాఘవరావు నమ్మబలుకుతున్నారు. ఇప్పటికే ఈ భూములను ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆసియా అభివృద్ధి బ్యాంకును చంద్రబాబు కోరారట. అందులోనూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆగస్టు పది లోపే నివేదిక ఇవ్వాలని గడువు మరీ విధించారట. ఇంకా చంద్రబాబు కలల ప్రపంచంలో.. విశాఖ- చెన్నై కారిడార్, కోస్తా వెంబడి ఆరు లైన్ల రోడ్డు సౌకర్యం, మచిలీపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులు, ఒంగోలు, నెల్లూరు మధ్య విమానాశ్రయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కలల ప్రాజెక్టులు.. చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది. మరి ఇవన్నీ వాస్తవ రూపం దాల్చేదెప్పుడో.

మరింత సమాచారం తెలుసుకోండి: