బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అహర్నిశలూ కృషిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలు, పరిపాలనాపరమైన చిక్కులు ఏవిధంగా అధిగమించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన రోజంతా తీరికలేకుండా గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహించారు. రాత్రి 11గంటలు దాటిన తర్వాత కూడా సీఎం సచివాలయంలోనే ఉన్నారు. న్యాయశాఖ కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు, సామాజిక, న్యాయనిపుణులతో పలు కీలకమైన అంశాలపై సమీక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలపై ఆర్ధిక, రెవెన్యూ, పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. బోధనా ఫీజుల చెల్లింపు, ఎంసెట్‌ అడ్మిషన్లు, స్థానికత, విద్యుత్‌, ప్రాజెక్టులు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ప్రభుత్వం ముందు సవాలుగా ఉండడంతో ప్రతిపక్షాల వాదనను, ఆరోపణలను తిప్పికొట్టేందుకు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి కూడా కేసీఆర్‌ హాజరు కాలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: