రికార్డు స్థాయి విజయంతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్నిఅధిరోహించింది. పార్టీ ప్రతిష్టకు, తన ఛరిష్మాను జోడించి ఘన విజయం దక్కించారు నరేంద్రమోడీ. ప్రధానిగా ఆశీనులై రెండు నెలలు దాటిపోయింది. కానీ మోడీ టీంలో రెండో స్థానం ఎవరిది అనేది మాత్రం ఇప్పటికీ తేటతెల్లం కావడం లేదు. ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలో హేమా హేమీలు చాలా మందే ఉన్నారు. రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ... ఇలా పార్టీ సీనియర్లుగా చెప్పుకునే వారు పదిమందికి పైగానే ఉన్నారు. నేరుగా రెండో స్థానం ఎవరిదో ప్రకటించకున్నా... పరోక్షంగా సంకేతాలు కూడా వెలువడకపోవడమే చర్చలకు దారి తీస్తోంది. నమో టీంలో ప్రధానంగా ద్వితీయ స్థానం ఇద్దరు నేతల మధ్యనే తారాడుతోంది. కేటాయించిన శాఖలను బట్టి చూస్తే హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీలలో ఎవరో ఒక్కరు మోడీ తర్వాత స్థానంలో నిలవనున్నారు. గత సభలో ప్రతిపక్ష నేత హోదాలో కూర్చున్న సుష్మా స్వరాజ్ కు సైతం ఆ స్థాయి ఉన్నా... ఆమె ఆది నుంచీ అద్వానీ వర్గం కావడంతో మోడీ పక్కన పెట్టిన సంగతి జగద్విదితమే. మొన్నటిదాకా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాజ్ నాథ్... అద్వానీ వంటి సీనియర్లను పక్కన పెట్టి నరేంద్రమోడీని పార్టీ పీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించారు. ఏకపక్షంగా నిలిచి మోడీకి పట్టం కట్టడంలో ఈ మాజీ యూపీ సీఎం పాత్ర మరువలేనిది. ఇకపోతే అరుణ్ జైట్లీ కూడా గుజరాత్ లో అల్లర్లు జరిగిన సమయంలో నరేంద్రుడి వెంట నడిచాడు. నమోకు కష్టకాలం వచ్చినప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత కూడా ప్రతీ సందర్భంలోనూ మోడీ పక్షాన నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి రెండో స్థానం కట్టబెట్టాలనే విషయంలో నమోకు కష్టకాలం వచ్చి పడింది. ఇటీవల ప్రధాని విదేశీ పర్యటన సందర్భంగా రెండో స్థానం పై తీవ్ర చర్చ జరిగింది. అయితే ఎవ్వరికీ ఇన్ ఛార్జీ ఇవ్వకుండానే మోడీ పర్యటన ముగించారు. ఇక పార్లమెంటులో ప్రధాని తర్వాత సీటు ఎవరికి దక్కుతుందో వారినే కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఆ సీటు హోంశాఖ పగ్గాలు అందుకున్న రాజ్ నాథ్ సింగ్ కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: