ఒకటీ... రెండు కాదు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు పూటకొక్కటి పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి నేటి వరకూ ఇప్పటికే ఊహించని అంశాలెన్నో పంచాయితీకి దారితీశాయి. ఆది నుంచీ అందరూ ఊహిస్తున్న సాగు, తాగు నీరు, విద్యుత్, విద్య, పోలవరం, స్థానికత, హైదరాబాద్ లో శాంతి భధ్రతలు, ఉద్యోగుల పంపకాలు వంటి వాటిల్లోనే వివాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు సచివాలయం మధ్యలో కంచె, ఎంసెట్ కౌన్సిలింగ్... వంటి ఊహించని అంశాలూ తెర మీదికి వస్తున్నాయి. తాజాగా సెక్రటేరియట్ లో ఇలాంటి మరో కొత్త పంచాయతీకి తెరలేసింది. రెండు రాష్ట్రాలకూ సచివాలయంలోని భవనాల పంపిణీ ప్రక్రియ ఇది వరకే ముగిసింది. అయితే కామన్ యుటిలిటీస్ నేపథ్యమే తాజా వివాదానికి కారణమవుతోంది. పంపకాల్లో భాగంగా హెచ్ బ్లాకు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. అయితే ఇదే భవనం కింది అంతస్తులో ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడిగా ఉపయోగపడే గ్రంథాలయం ఉంది. అయితే తాజాగా ఈ గ్రంథాలయం స్థానంలో తాజాగా ఏపీ ప్రభుత్వం తమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో గ్రంథాలయ సామాగ్రి తొలగించి, మార్పులు చేసేందుకు సిబ్బంది సిద్దమయ్యారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రంథాలయం ఇరు రాష్ట్రాలకూ కామన్ అవసరం అయినందున ఏకపక్షంగా మార్పులు చేయడం సరికాదని అడ్డుకున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్ ల అనుమతితోనే మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఏపీ ప్రభుత్వ సిబ్బంది పనులు నిలిపేశారు. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ లైబ్రరీ సచివాలయ ఉద్యోగులతోపాటు మంత్రులు, విలేకరులకూ ఎంతో ఉపకరిస్తోంది. రెండు రాష్ట్రాలకూ కలిసి సెక్రటేరియట్ లో ఈ ఒక్కటే గ్రంథాయలం ఉంది. గతంలోనే సెక్రటేరియట్ భవనాల కేటాయింపుపై ఇరు రాష్ట్రాలూ వాదులాడుకున్నాయి. తమకే తక్కువ వచ్చాయంటే... తమకే తక్కువ అంటూ రచ్చ చేశాయి. మరి తాజాగా హెచ్ బ్లాకులో మొదలైన ఈ కామన్ గ్రంథాలయ వివాదం ఏ ధరికి చేరుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: