తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టున్నారు. ఇరు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచే కాదు... అంతకుముందు నుంచి కూడా ఇద్దరు చంద్రులూ రాజకీయ ప్రత్యర్థులే. ఇప్పుడైతే మరీ ఎవ్వరు ఏ పని ముట్టుకున్నా... మరొకరు వేలెత్తి చూపడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు రాజకీయాల కోసమే కలిసి తిరిగిన వీళ్లిద్దరూ మొన్నా మధ్య కలుసుకోనున్నారనే ప్రచారం సాగింది. కానీ అది సాధ్యపడలేదు. ఉమ్మడి రాజధాని నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్న చంద్రబాబుకు మాత్రం ఏ కార్యక్రమంలోనూ కేసీఆర్ తారసపడడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం కేసీఆర్ కూడా ఎక్కడైనా కలిస్తే బాగుండునని ఆలోచిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ, అధికార ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేతన వైఎస్ జగన్, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ నేతలు నాయిని నర్సింహ్మారెడ్డి, ఈటెల రాజేందర్, మహమూద్ అలీతోపాటు పలువురు పాల్గొన్నారు. జగన్, చంద్రబాబులు ఇద్దరూ ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న టీజీ మంత్రి నాయినితో కేసీఆర్ కూడా వస్తే బాగుండేది అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోయారని టక్కున సమాధానమిచ్చారు నాయిని. కేసీఆర్ ను కలవడానికి ఆసక్తి చూపిన చంద్రబాబు విందులో అందరితోనూ కలుపుగోలుగా గడిపారు. టీసీఎల్పీ నాయకుడు జానారెడ్డితో మీరొక్కరే నలుగురి పెట్టు అని బాబు అనగా... ప్రతిపక్షం అయినందున చేతి నిండా పని లేదని జానా బదులిచ్చారు. ఇంతలో జోక్యం చేసుకున్న పొన్నాల... ప్రతిపక్షానికే ఎక్కువ పని ఉంటుందని చురకేశారు. కాంగ్రెస్ లో స్వేచ్చ ఎక్కువని, ఎవ్వరు ఏదైనా మాట్లాడతారని బాబు అనడంతో గవర్నర్ దర్బార్ హాలులో నవ్వులు విరబూశాయి. ఈ ఇఫ్తార్ విందులో చంద్రబాబు మాత్రమే కాదు... గవర్నర్ నరసింహన్ కూడా నాయకులతో ఉల్లాసంగా గడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: