రాష్ట్రవిభజన నేపథ్యలో అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి ముఖ్యమంత్రులు అయ్యారు. పాలనలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. పాలన విషయంలో ఎవరి అవకాశాలు, పరిమితులు వారికి ఉన్నాయి. ఈ విషయంలో జనం పోల్చి చూసుకునే అవకాశం ఉన్నా.. ఇంత స్వల్ప సమయంలో వారి పనితీరుపై ఓ నిర్ణయానికి రావడం కష్టం. అనేక విషయాల్లో బేధాభిప్రాయాలు ఉన్న ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండులు ఒక్క విషయంలో మాత్రం ఏకీభవిస్తున్నారు. ఒకేలా అడుగులు వేస్తున్నారు. ఐతే అది పరిపాలనకు సంబంధించిన విషయం కాదు. రాజకీయ వారసత్వానికి సంబంధించింది. చంద్రబాబు.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశయంతో తీవ్రంగా శ్రమించారు. ఈసారి కాకపోతే.. వయసైపోయి.. ఇక జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి కాలేనని భావించారు. మొత్తానికి అధికారం దఖలుపడిన తర్వాత.. 2019 నాటికి కొడుకు లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే.. పార్టీ అధికారంలోకి వచ్చినా.. మంత్రిపదవులు వంటి అధికార బాధ్యతలు అప్పగించకుండా.. పార్టీపై పట్టుపెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిథి సమన్వయకర్త బాధ్యత అప్పగించడం వెనుక అసలు కారణం అదే. లోకేశ్ కూడా ఆ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లాన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దానికి పార్టీల కార్యకర్తలే ముఖ్యమనే విషయం ఈయనకు బాగా తెలుసు. అందుకే కేటీఆర్‌ ప్రజలచేత ఎన్నుకోబడి, మంత్రి పదవిలో ఉన్నా, పార్టీ వ్యవహారాలను కూడా కేటీఆర్‌ చూస్తున్నారు. కేసీఆర్‌ రాష్ట్ర అభివృద్దివైపు దృష్టిపెట్టగా, కొడుకు కేటీఆర్ మాత్రం తన మంత్రిత్ర శాఖను సక్రమంగా నడుపుకుంటూ, పార్టీ పటిష్టానికి, కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకొని, వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. తెలంగాణ సాకారంతోనే రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని కేసీఆర్ భావించినా.. కేటీఆర్ పగ్గాలు స్వీకరించడానికి ఇంకా సమయముందని భావించిన కేసీఆర్.. ఈసారికి తానే స్వయంగా రంగంలోకి దిగారు. 2019లో తనయుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: