సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో, సంస్కరణల అమలులో దేశంలోనే ముందు వరుసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ సంస్కరణల బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దిద్దుబాటు కార్యక్రమాలు ప్రారంభిం చారు. గత పదేళ్ళ ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించారు. గతంలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తుకు బాట వేసేందు కు పరిపాలన వ్యవహారాలను ప్రతిరోజు సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. 1991లో ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంస్కరణలు చేపట్టగా, ఆయనను అనుసరించి వాటిని అమలు చేయడంలో చంద్రబాబు దేశంలోనే ముందు వరుసలో నిలిచారు. సంస్కరణలతోనే ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఉత్పత్తి పెంచవచ్చనే దిశలో అనేక కార్యక్రమాలు చేపట్టి సానుకూల ఫలితాలు సాధించగలిగారు. సంస్కరణలతోనే సంపద సృష్టించవ చ్చని, అది ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని విశ్వసిస్తారు. అప్పటి సంస్కరణల అమలు తీరులనే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో అమలు చేయాలని భావిస్తు న్నారు. ప్రజాకర్షణ పథకాలు అమలు చేస్తూనే సంస్కరణలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ముందుగా ఆర్థికంగా దివాళా తీసిన ప్రభుత్వరంగ సంస్థలను బాగుపరిచేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. 1999లో రెండవసారి సీఎం అయ్యాక మొదటగా విద్యుత్‌ సంస్కరణలు చేపట్టి ఈ రంగాన్ని సంస్కరించేం దుకు కార్యాచరణ అమలు చేశారు. దీంతో విద్యుత్‌ రంగంలో మంచి ఫలితాలు సాధించడంతో ఇదే తీరును ఇతర రంగాల్లో కూడా అమలు చేయాలని భావించారు. అయితే సంస్కరణల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.  మరోవైపు వైద్య రంగంలో కూడా సంస్కరణల పేరుతో యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడంతో పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సంస్కరణల ఫలితాలు వచ్చేలోగానే ప్రభుత్వం పడిపోయింది. ఇదిలాఉండగా, తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న 55 ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడం, మరికొన్నింటిని ప్రైవేటీకరిం చారు. సహకార చక్కెర కర్మాగారాలు, టెక్స్‌టైల్స్‌ మిల్స్‌తోపాటు మరికొన్ని సంస్థలను మూసివేసి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటీకరి స్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా నష్టాల్లో ఉన్నవాటిని వదిలించుకుని ప్రభుత్వంపై భారం తగ్గించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారాయి. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నేరుగా ప్రజలపై భారంపడే విధంగా సంస్కరణలు చేపట్టేందుకు ధైర్యం చేసే అవకాశాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంక్రమించిన మరో 44 ప్రభుత్వ రంగ సంస్థల స్థితిగతులపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. ఈ 44 సంస్థలు ఎక్కువ శాతం నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో వాటి సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా ప్రభుత్వంపై మోయలేని భారంగా పరిణమించింది. ఒకవైపు రాష్ట్రం లోటు బడ్జెట్‌ ఎదుర్కొంటుండగా, మరోవైపు రైతు రుణమాఫీతో కోలుకోలేని భారం పడింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వనరుల సమీకరణకు మార్గాలు అన్వేషించడం ఆరంభించింది. ఇందులో భాగంగా వీటి ఆస్తులను విక్రయించేందుకైనా ప్రభుత్వం వెనుకాడే పరిస్థితుల్లో లేదు. నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రభుత్వరంగ సంస్థలను లాభాల బాటలోకి తెచ్చి వాటిని బ్యాంకులకు తాకట్టుపెట్టడం, పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన వాటిని తెగనమ్మేయడమే ఆయన ముందున్న ఏకై క మార్గంగా భావిస్తున్నారు. ఇదిలాఉండగా, ఒకవైపు ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని మళ్ళీ స్వాధీనం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికే ఓ గుర్తింపు తెచ్చే కంపెనీగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సింగరేణి క్వాలరీలను మరింత లాభదాయకం చేసి ఈ ప్రాంత కార్మికులకు లబ్ధి చేకూర్చడంతోపాటు తమకు అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు ఎక్కువగా కోటా పొందేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి కార్పొరేషన్లు లేకపోవడంతో చంద్రబాబు పునరుద్ధరణపై అంతగా ఆశలు పెట్టుకోవడం లేదు. రుణమాఫీతో ప్రభుత్వంపై 40 వేల కోట్ల రూపాయల భారం పడుతుండగా, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ద్వారా ఈ నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నివేదికలు రాగానే వీటి భవిష్యత్తును తేల్చేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: