తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాల పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడం వల్ల కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమక్షంలోనే వివాదాస్పద అంశాలను తేల్చేందుకు కమలనాథన్‌ కమిటీ సిద్ధమైంది . ఇవాళ ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కమలనాథన్‌ సమావేశం కానున్నారు. కమిటీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు ఉండటం, వీరిమధ్య కొన్ని ప్రధానాంశాలలో భేదాభిప్రాయాలు ఇప్పటికి కొనసాగడం వల్లనే ఈ పరిస్ధితి తలెత్తింది. వివాదాస్పద అంశాలను కొలిక్కి తెచ్చేందుకు రంగంలోకి దిగిన కమల్‌నాథన్‌ కమిటీ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయసును పెంచడంతో జూన్ రెండు తర్వాత 58 ఏళ్లకే పదవీ విమరణ చేసిన ఉద్యోగుల విషయంలో విభజన ఎలా చేయాలన్నఅంశంపై ఇరు రాష్ట్రాల అధికారులు తీవ్రంగానే చర్చించినా పరిష్కారం దొరకలేదు. ఏపీలో ఆప్షన్లు స్వీకరించాలంటే వయోపరిమితి అడ్డంగా నిలుస్తుందన్న వాదన ఉంది. రెండేళ్ల లోపుగానే రిటైర్మెంట్ ఉన్నవారిని కదిపేందుకు నిబంధనలు అంగీకరించవు. స్ధానికత ఆధారంగా విభజన జరగాలన్న అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. స్ధానికత ప్రాతిపదికగా ఏం ఉండాలన్నది కూడా సమస్యగా మారింది. సర్వీసు రిజిస్టర్ల అధారంగా చేయాలంటే అందులో ఎక్కడా వివరాలు లేకపోవడం జఠిలంగా తయారైంది. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఒక ఉమ్మడి అభిప్రాయం వ్యక్తం మయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: