తెలంగాణలో ఇప్పుడు విద్యార్థి లోకం ఆగ్రహంతో అట్టుడుకుతోంది. ఓ వైపు ఉస్మానియా, మరోవైపు కాకతీయ... అన్ని యూనివర్సిటీల్లోనూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి. జిల్లాల్లో పర్యటించే మంత్రులకు నిరసనలు స్వాగతం పలుకుతున్నాయి. మొన్నటిదాకా టీఆర్ఎస్ ను తమ పార్టీగా జైకొట్టిన విద్యార్థులే ఇప్పుడు నిరసనకారులుగా మారారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే నిరుద్యోగుల ఆగ్రహానికి కారణం. అయితే విద్యార్థులు, నిరుద్యోగులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని... భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన ఉంటుందని ఎంత చెప్పినా నిరసనలు మాత్రం సద్దుమణగడం లేదు. అందుకే ఆ అగ్గిని చల్లార్చే పనికి శ్రీకారం చుట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - టీపీఎస్సీ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకటీ రెండు రోజుల్లోనే కమిషన్ ఏర్పాటు ఫైలును గవర్నర్ కు పంపే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. దస్త్రం గవర్నర్ పేషీకి చేరుకున్న పది రోజుల్లో టీపీఎస్సీ అధికారికంగా పురుడు పోసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛైర్మన్ తో పాటు కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా ఆరుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ప్రభుత్వాధినేత కేసీఆర్ కు ఛైర్మన్ గా ఎవరిని నియమించాలి, సభ్యులుగా ఎవరు ఉండాలి... అనే విషయాల్లో పూర్తి క్లారిటీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైన వెంటనే భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రూప్-1, గ్రూప్-2, జేఎల్, డీఎల్, ఏఈ, ఏఈఈ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్.... కేటగిరీల్లో మొత్తం సుమారు 20 వేల ఖాళీలు భర్తీ చేయాలని చూస్తోంది. భారీగా ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తేనే తప్ప విద్యార్థి లోకం కలగజేసిన నష్టాన్ని పూడ్చుకోలేమని కేసీఆర్ భావిస్తున్నారు.టీపీఎస్సీ నుంచి జారీచేసే నోటిఫికేషన్లతోపాటు డీఎస్సీ ని కూడా సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని చూస్తున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం వేగంగా వేస్తున్న ఈ అడుగులు... నిరుద్యోగుల్లో రగిలిన అసంతృప్తి జ్వాలను ఎంతవరకు చల్లార్చుతాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: