అధికారంలోకి వచ్చీ రాగానే ఠంచనుగా రైల్వే చార్జీలు పెంచేశారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారు! ఇదేమిటీ అంటే.. డబ్బు తో ఏముంది. భద్రత ముఖ్యం అన్నారు. సౌకర్యమే అసలు చింత అన్నారు. ఒక్కోరి జేబు నుంచి ఒక్కో రూపాయి ఎక్కువఅయితే కొత్త భారం కాదన్నారు. రైల్వేలను పటిష్టపరుస్తామన్నారు. మొత్తం అంతా మారిపోతుందన్నారు. ఎన్నింటికో అలవాటు పడ్డ భారతీయులు దానికి కూడా సమాధానపడ్డారు. డబ్బు పోతే పోయిందిలే.. మోడీ సర్కార్ భద్రతకు పెద్ద పీట వేస్తామని అంటోంది... నిజంగా అది జరిగినా మేలే కదా! రైల్లో ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుంది కదా.. అనే ఆశావాదంతో చార్జీల పెంపును భరించారు. మరి పెంచిన చార్జీలను తక్షణం అమల్లో పెట్టే ప్రభుత్వాలు.. భద్రత, సౌకర్యం అనే విషయాల్లో మాత్రం వాయిదా పద్ధతిని అనుసరిస్తున్నాయి. మెదక్ జిల్లాల్లో అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకొన్న రైలు ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా రావడం వల్లనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ ది ఎంత తప్పు ఉందో.. రైళ్లను సకాలంలో పంపలేని రైల్వేశాఖది కూడా అంతే ఉంది. రైల్వే క్రాసింగ్ వద్ద కాపలాను పెట్టలేని చేతగాని తనం కూడా అంతే ఉంది. ఒకవైపు రైల్వే బడ్జెట్ లో వరాలే వరాలు.. బుల్లెట్ రైలు ను తీసుకొస్తాం అంటూ..జనాలను ఊరిస్తారు. భధ్రతకు పెద్ద పీట వేస్తామంటూ చెబుతారు. తీరా ఆ రోజు గడిచిన తర్వాత అంతా మామూలే! బుల్లెట్ రైళ్లు, మెట్రో రైళ్లు అంటూ ప్రజలను మునగమాను ఎక్కించే ప్రయత్నాలు ఎలా ఉన్నా... కనీసం ప్యాసింజర్ రైళ్లను సకాలంలో నడిపి... మన ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలకు కొంత రక్షణ కల్పిస్తే చాలు!

మరింత సమాచారం తెలుసుకోండి: