రాజధాని పేరుతో భూముల ధరలకు కృత్రిమ రెక్కలు మొలిపిస్తున్న రియల్టర్ల దందాకు అడ్డుకట్ట వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూ మాఫియా మాయలోపడి సామాన్యులు నష్టపోకుండా చూసేందుకు ఆర్డినెన్స్‌ అసా్త్రన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. భూముల ధరలను నియంత్రించడానికి అందుబాటులో ఉన్న పాత చట్టాల బూజు దులిపి కొత్తరూపుతో ఆర్డినెన్స్‌గా తీసుకురానున్నారు. ఇటీవలి కాలంలో కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో రిజిసే్ట్రషన్లతో సంబంధం లేకుండా పెద్దఎత్తున భూలావాదేవీలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని రానుందని ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా చెబుతూ వస్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో భూముల కొనుగోళ్లు భారీగా సాగుతున్నాయి. లావాదేవీలు ఎక్కువగా అగ్రిమెంట్లు, జీపీఏ పద్ధతిలోనే జరుగుతున్నాయని ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. భూమాఫియా సాగిస్తున్న ఈ దందాతో అటు సామాన్యులు భారీగా నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వానికి రావల్సిన ఆదాయానికీ గండిపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్డినెన్స్‌ అసా్త్రన్ని సంధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి మద్రాస్‌ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పట్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రాజధాని ఎక్కడ అన్నదానిపై ప్రాంతాల మధ్య పోటీ ఏర్పడింది. కొద్దిరోజులు కర్నూలులో అని, మరి కొంతకాలం గుంటూరు అని, విజయవాడ అని రకరకాల ప్రచారాలు జరగడంతో ఆ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అప్పటి ప్రభుత్వం ఆంధ్రా(ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్పెక్యులేషన్‌ ఇన్‌ ఇమ్మూవబుల్‌ ప్రాపర్టీస్‌)యాక్ట్‌ - 1954ను తీసుకొచ్చింది.  ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీన్ని ఆంధ్రప్రదేశ్‌ చట్టంగా మార్పుచేశారు. భూముల ధరలను నియంత్రించేందుకు ఈ చట్టం ప్రభుత్వానికి కీలకమైన అధికారాలు ఇస్తుంది. ఈ చట్టం ప్రకారం కొన్ని మండలాలను, గ్రామాలను నోటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నోటిఫై చేసిన ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలను, రిజిసే్ట్రషన్లను నిరోధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. స్థిరాస్తుల బదలాయింపులపై ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు. ధరలు పెంచే అధికారం ఒక్క ప్రభుత్వానికే ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన, లేదా అమల్లో ఉన్న ధరలకు మించి ఎక్కువ ధరలకు లావాదేవీలు జరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు భారీ పెనాల్టీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: