లక్షన్నర రుణం దాటిదంటే.. అది బినామీనే... అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కొత్త కామెంట్ సంచలనమే అయింది. రుణమాఫీపై చంద్రబాబు కొత్త మెలిక పెడతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...రోజురోజుకు ట్యూన్ డౌన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సందర్భంగా షరతుల్లేని రుణమాఫీ చేస్తామన్న బాబు...ఇప్పుడు రాష్ట్ర విభజనతో అప్పులు మిగిలాయంటూ మాట మార్చేశారు. తాజాగా లక్షన్నరకు పైగా మాఫీ అడిగేవారు బినామీల పేర్లతో తీసుకున్నారంటూ వ్యాఖ్యానించారు... దీంతో మాఫీపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులు తీసుకున్న రుణాలు షరతుల్లేకుండా మాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో ప్రకటించారు చంద్రబాబు. తర్వాత రాష్ట్రం విడిపోయింది...ఎన్నికలు పూర్తయి...చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు అప్పులు మిగిలాయి. ఆర్థికలోటు ఉందన్న కారణంతో...లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయగలమంటూ చంద్రబాబు లీకులిచ్చారు. లీకులకు బలం చేకూర్చే విధంగా...లక్షన్నర రైతు రుణాలు మాఫీ చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. రైతుల రుణాలు ఎక్కువగా ఉండటంతో...చంద్రబాబునాయుడు ఇంటికొక మాఫీ అంటూ స్వరాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. తాజాగా లక్షన్నర రూపాయల కంటే ఎక్కువ అప్పులున్నాయంటే...బినామీ పేర్లతో అప్పులు తీసుకున్నవేనంటూ అనంతపురంలో వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను రాజకీయ వ్యాఖ్యలుగానే తీసుకోవాలంటున్నాయి పార్టీ వర్గాలు. అంతేకాదు...జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...లక్షన్నర రూపాయలుగా చంద్రబాబు కటాఫ్ పెట్టడంతో...96శాతం మంది రైతులు లబ్దిపొందనున్నారు. వీరందరికి వందశాతం రుణాలు మాఫీ అవుతాయి. మిగతా నాలుగు శాతం రైతులకు కూడా లక్షన్నర వరకు మాఫీ అవుతుంది. లక్షన్నర కంటే ఎక్కువ తీసుకున్న రైతులు మాత్రం...రుణంలో మిగతా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీకో రుణమాఫీ అన్న చంద్రబాబు...ఫ్యామిలీ అంటే ఏమిటో కూడా నిర్వచించారు. భర్త, భార్య మైనర్ పిల్లలుంటే లక్షన్నర రుణమాఫీ అవుతుంది... అదే పిల్లలు మేజర్లయి...వాళ్ల పేర్ల మీద రుణాలుంటే...అవి కూడా లక్షన్నర దాకా మాఫీ అవుతాయి. ఫ్యామిలీకో రుణమాఫీ వర్తింపు చేయడంతో... మైజార్టీ రైతులు లబ్దిపొందుతున్నారు. రుణమాఫీపై వాదనల వరకు సరిపోతున్నా...అమలుకు వచ్చేటప్పటికీ ఏమవుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: