మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి రిజర్వాయర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం ఆల్మట్టి రిజర్వాయర్ ఇన్‌ఫ్లో 1.55 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేసి 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టి గరిష్ట స్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1696 అడుగులకు చేరింది. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటికి ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న తుంగభద్ర రిజర్వాయర్‌లోకి కూడా దాదాపు లక్ష క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1633కాగా, ఇప్పటికే నీటిమట్టం 1622 అడుగులకు చేరింది. దీంతో కృష్ణా నది దిగువ ప్రాంతంలో నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 10.7 అడుగులు కాగా, కృష్ణా డెల్టా కాలువలకు 517 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయనున్నారు.గత కొద్ది రోజులుగా వర్షాలు కురువకపోవడంతో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు ప్రాంతంలో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి రిజర్వాయర్ గేట్లు ఎత్తివేస్తున్నారన్న విషయం తెలియడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. మరో 10 రోజుల్లో కృష్ణాడెల్టాకు పూర్తి స్థాయిలో నీటి సరఫరాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: