రాజకీయ పార్టీలు ఇకనైనా ప్రజలను మోసం చేసే రాజకీయాలకు దూరం కావాలి. ఎన్నికలు వస్తున్నాయనగానే రాజకీయ పార్టీలు అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చేందుకు కుట్రలు పన్నటం ఒక ఆనవాయితీగా మారింది. రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించేందుకు రాజకీయ పార్టీలు వెనకాడటం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలల్లోనైనా పరువు దక్కించుకోవాలనే దురాశతో కుల,మత రిజర్వేషన్లకు తెర లేపింది. ఈ సంవత్సరాంతానికి మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్.సి.పితో కలిసి అధికారాన్ని చలాయిస్తున్న కాంగ్రెస్ అధినాయకులు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు రిజర్వేషన్ల నాటకం మొదలు పెట్టారు. మహారాష్టల్రో దాదాపు పదహారు శాతం ఉన్న ఉన్నత వర్గానికి చెందిన మరాఠాలకు పదహారు శాతం రిజర్వేషన్లు, ముస్లిం మైనారిటీలకు ఆరు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఈ నిర్ణయం తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయటం అంటే ప్రజలను ప్రలోభపెట్టేందుకే అనేది నిర్వివాదాంశం. రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు కల్పించటం దాదాపుగా అసాధ్యం. గతంలో చాలా మంది నాయకులు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించటం ద్వారా మత రాజకీయం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. హిందు మతంలో మాత్రమే కులవ్యవస్థ ఉన్నది. ఇతర మతాల్లో ఉన్న ఇలాంటి విభజనకు మతపరమైన గుర్తిం పు లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ముస్లింలకు ప్రకటించిన ఆరు శాతం రిజర్వేషన్ల విధానం కూడా కోర్టు పరిశీలనలో కొట్టుకుపోతుందనేది పచ్చి నిజం. ముస్లిం మైనారిటీల పట్ల నిజమైన ప్రేమ, అభిమానం ఉంటే వారికి విద్యా సౌకర్యం కల్పించి పటిష్టంగా అమలు చేయగలగాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం సచ్చార్ కమిటీ నివేదికను అమలు చేయలేదు, సచ్చార్ కమిటీ సిఫారసులను తుచతప్పకుండా అమలు చేస్తే ముస్లిం మైనారిటీలు కొంతైనా బాగుపడేవారు. ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా, సమాజికంగా వెనుకబడి ఉన్నంత కాలం ఈ రాజకీయ నాయకుల ఆటలు సాగుతుంటాయి. కాబట్టే వారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారు అధికారంలోకి రాగానే మరిచిపోతారనేది పచ్చి నిజం. పృథ్వీరాజ్ చౌహాన్ తమ పార్టీరాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం మైనారిటీలతోపాటు మరాఠాల భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్టల్రో మరాఠాలు బాగా అభివృద్ది చెందిన వర్గం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బాగా ఎదిగిన ఒక వర్గాన్ని వెనుకబడిన వర్గంగా ముద్ర వేసి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించటం ఎంత వరకు సమంజసం? సమాజంలోని వివిధ వర్గాలు కాలక్రమంలో అభివృద్ధి చెంది సామాజికంగా, ఆర్థికంగా పైకి ఎదగటం ద్వారా ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఓ.బి.సి అనే ముద్ర నుండి బైట పడాలి. ఇందుకు ఆయా ప్రభుత్వాలు తోడ్పడాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అవుతుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతం యాభైకి మించకూడదు. రాజ్యాంగం ప్రకారం ఎస్.సిలకు పనె్నండు శాతం, ఎస్.టిలకు ఏడు శాతం రిజర్వేషన్లు అమలులో ఉండటం అందరికి తెలిసిందే. మండల్ కమీషన్ సిఫారసుల ప్రకారం ఇతర వెనుకబడిన కులాల వారికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం మరాఠాలకు పదహారు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాని వలన వెనుకబడిన కులాల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. ఇది ఏ విధంగా చూసినా మంచి విధానం కాదు. బి.సి వర్గాల్లో కొందరు బాగా అభివృద్ధి చెందినట్లు ఉన్నత వర్గాల్లో కూడా కొందరు ఆర్థికంగా బాగా వెనుకబడిన వారున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి తప్ప ఇలా రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తప్పుదోవ పట్టించటం మంచిది కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందింది జాట్ వర్గం. కాంగ్రెస్ కొంత కాలం క్రితం ఈ వర్గం వారిని వెనుకబడిన కులాల్లో చేర్చి రిజర్వేషన్ల సౌకర్యాన్ని వర్తింపజేయం వలన ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్‌లకు ఇతర వెనుకబడిన కులాల వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. జాట్‌లను ఓ.బి.సిలో చేర్చినా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలగలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించటం వలన లభించే ఓట్ల కంటే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు దూరం కావటంతో కోల్పోయే ఓట్ల సంఖ్య అధికమనేది అర్థం చేసుకోవటం మంచిది. వాస్తవానికైతే కొంత కాలం తరువాత రిజర్వేషన్ల విధానం అనేదే ఉండ కూడదు. అయితే ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాల మూలంగా రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల మూలంగా ఆయా వర్గాలవారేమైనా బాగుపడుతున్నారనేది కూడా నిజం కాదు. ఇదే నిజమైతే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రిజర్వేషన్లను అనుభవిస్తున్న ఎస్,.సి, ఎస్.టిలో సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడో బాగుపడి ఉండాలి కానీ అలా జరగలేదు. కాబట్టి రాజకీయ నాయకులు రిజర్వేషన్ల పేరిట ప్రజలు మోసం చేసే బదులు వారి నిజమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: