పదహారు మంది బడి పిల్లలు చనిపోయాక గానీ రైల్వే అధికారులు కళ్లు తెరవలేదు. మెదక్ జిల్లా మాసాయిపేటలో చోటుచేసుకున్న ఘోర రైలు, స్కూల్ బస్సు దుర్ఘటనలో చిన్నారుల ప్రాణాలను బలిగొన్న కాపలా లేని అన్‌మెన్ లెవెల్ క్రాసింగ్ వద్ద శుక్రవారం రైల్వే అధికారులు హుటాహుటినా రైల్వేగేటు నిర్మాణ పనులు చేపట్టారు. పరిసర ప్రాంతాల జనం ఎప్పటి నుంచో గేటు ఏర్పాటు చేయాలని కోరుతున్నా రైల్వే అధికారులకు చీమకుట్టలేదు. గురువారం లెవెల్ క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొన్న దుర్ఘటనలో 16 మంది పిల్లలు దుర్మరణం చెందారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలంలోని జరిగిన సంఘటనపై కెసిఆర్ దిగ్భాంతికి గురయ్యారు. రైల్వే జిఎం శ్రీవాత్సవతో ఫోన్‌లో సంఘటనపై మాట్లాడి తక్షణమే గేటును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంటనే శ్రీవాత్సవ సికింద్రబాద్‌లోని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు శుక్రవారం నాడు మాసాయిపేటకు చేరుకొని త్వరితగతిన పనులు చేపట్టారు. గేటు పక్కన గల గార్డు గదిలోని కేబుల్‌ను కనెక్షన్ చేసి గేటుకు చక్రాలు, రాడ్‌తో పాటు మిష్‌నరీని ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే ఈ పనిచేసి ఉంటే దారుణం జరిగేది కాదని వెల్దుర్తి, తూప్రాన్ ఎంపిపిలు సునీతాప్రతాప్ రెడ్డి, గుమ్మడి శ్రీనివాస్, వెల్దుర్తి మండల జెడ్‌పిటిసి సభ్యురాలు ముల్క లక్ష్మి శ్రీనివాస్, మాసాయిపేట సర్పంచ్ మధుసూధన్ రెడ్డి, వెల్దుర్తి, తూప్రాన్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మోహన్‌రెడ్డి, నరేందర్ రెడ్డి అన్నారు. గార్డుగదిని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా అది చిన్నారులు మృత్యువాత పడేవరకు ఎవరికి కూడా కాపలా గది ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాకుండా పోయిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: