చదువుకుంటే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దేశానికి అతిపెద్ద సంపద పిల్లలు అని, వారిని బాగా చదివిస్తే వారే దేశానికి పెద్ద ఆస్తి అవుతారన్నారు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కదిరి మండలం కుటాగుళ్ల పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యధిక ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంటే నాలెడ్జ్‌కు మారుపేరుగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా బాలకార్మికులు ఉండకూడదన్నారు. పిల్లలను పనిలో పెడితే ఇబ్బందులు తప్పవన్నారు. రాష్ట్రంలో సుమారు 1,59,524 మంది పిల్లలు బడి బయట ఉన్నారన్నారు. వీరందరినీ బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా బడిలో చేర్చుకోవాలన్నారు. ఈనెల 21న బడి ఉత్సవాన్ని పెద్ద పండగలా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు సైకిళ్లు ఇప్పిస్తామన్నారు. ఇంకా బాగా చదువుకుంటే ఐపాడ్‌లు, కంప్యూటర్లు కూడా ఇస్తామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమాజంలో మగపిల్లలు, ఆడపిల్లలు అన్న అసమానతలు లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకురావడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకోవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని తద్వారా పేదరికాన్ని పారదోలవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సిహెచ్ అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి అదర్‌సిన్హా, కమిషనర్ ఉష పాల్గొన్నారు. బెదిరిస్తే బెదరను . ------------------ ‘బెదిరిస్తే బెదిరే రకం కాదని, అంతా ఒక పద్దతి ప్రకారం చేస్తానని, న్యాయం అనుకుంటేనే పనిచేస్తానని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కదిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తుండగా డిఎడ్ విద్యార్థులు పెద్దఎత్తున కేకలు వేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. వీరు ఎంతసేపటికీ నిరసనలు ఆపకపోవడంతోచంద్రబాబు తీవ్ర స్వరంతోవారిని హెచ్చరిస్తూ బెదిరిస్తే బెదిరే మనిషిని కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు. ‘మిమ్మల్ని రెండు రోజులుగా చూస్తున్నాను.. మీ పద్దతిలో మార్పురాలేదు. మీరు రోడ్డెక్కడం వల్ల ఉద్యోగాలు రావు. బాగా చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. మీరు బెదిరించినంత మాత్రాన బెదిరి మీరు చెప్పినట్లుగా చేస్తాననుకుంటే పొరపాటే. న్యాయం అయితేనే ఒక పద్దతి ప్రకారం చేస్తాను. నాకు న్యాయం అనిపిస్తే మీ ఇంటికి వస్తా, మీ పనులు చేసి పెడతాను’ అని అన్నారు. తన హయాంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. అనంతరం స్వరం తగ్గించిన బాబు ఇది మీ మనసులో పుట్టిన ఆలోచన కాదని, బయటి నుంచి ఏవో అదృశ్యశక్తులు మీతో ఇలా ఆటాడిస్తున్నాయన్నారు. ఆ శక్తులు ఏవో మీకు తెలుసు కదా తమ్ముళ్లూ అంటూ చమత్కరించారు. హైదరాబాదును అభివృద్ది చేసింది నేనే ---------------------------------------- హైదరాబాదు నగరాన్ని అభివృద్ది చేసింది తానేనని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గానీ, టిఆర్‌యస్ గానీ అభివృద్ది చేయలేదన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాదు లాంటి నగరాలను మూడు నుంచి నాలుగు వరకూ అభివృద్ది చేసి చూపిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: