లబ్ధిదారులకు, అందులోనూ సామాన్యుడికి ఆహారధాన్యాలను గుజరాత్‌ సర్కారు తగురీతిలో అందకుండా చేసింది. ఈ నిప్పులాంటి నిజం కాగ్‌ నివేదికలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు గోధుమలు, ఇతర ఆహారధాన్యాలు ప్రతి ఏటా సబ్సిడీకి అందుతుం టాయి. అయితే గోధుమలను, కానీ బియ్యాన్ని కానీ సకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవల్సి ఉంటుంది. ఈ టేకాఫ్‌ ప్రక్రియ సరిగ్గా లేకపోతే, సబ్సిడీద్వారా వచ్చే నిధులు మురిగిపోతాయి. ప్రభుత్వానికి వచ్చే నష్టం సంగతి పక్కనపెడితే, సబ్సిడీ ఆహార ధాన్యాలు ప్రజలకు ఆ మేరకు అందకుండా పోతాయి. ఈ టెకాఫ్‌ ప్రక్రియను సరిగ్గా పాటించకపోవడంతో 2008 నుంచి 2013 మధ్యకాలంలో గుజరాత్‌లోని సబ్సిడీ లబ్ధిదార్లకు తీవ్రనష్టం జరిగిందని ప్రభుత్వ గణాంకాల సంస్థ కాగ్‌ తేల్చిచెప్పింది. కేంద్రం నుంచి సబ్సిడీ కోటాను సకాలంలో తీసుకోకపోవడంతో గుజరాత్‌కు ఈ ఐదేళ్ల కాలంలో రూ 2,652 కోట్ల మేరకు సబ్సిడీ నష్టం జరిగిందని కాగ్‌ తన నివేదికలో తెలిపింది. 2008 నుంచి 2013 వరకూ లెక్కలు చూస్తే గుజరాత్‌ సబ్సిడీ ఆఫ్‌టేక్‌ నిర్ణీత కోటా కన్నా 33 శాతం తగ్గింది. ఆంత్యోదయ, అన్న యోజన వంటి సామాజిక పథకాల పరిధిలో కేంద్రం బడుగు వర్గాల ప్రయోజనం కోసం వారికి చవక ధరలకు నిత్యావసర సరుకుల సరఫరా కోసం సబ్సిడీ ధాన్యం అందిస్తుంది. వివిధ పథకాల కింద అందే చివరికి మూడు శాతం కోటాను గుజరాత్‌ ప్రభుత్వం తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. బియ్యం కోటాలో 77 శాతం తక్కువ మొత్తాన్ని, గోధుమ కోటాలో కూడా తక్కువ మొత్తాన్ని తీసుకుంది. ఈ నెల 25న రాష్ట్ర అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టారు. తక్కువ కోటా సబ్సిడీ సరుకులను తీసుకోవడంతో లక్షలాది మందికి సబ్సిడీ సరుకులు అందకుండా పోయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఇతర రాష్ట్రాలతో పాటు గుజరాత్‌కు కేటాయించిన సబ్సిడీ కోటాను స్వీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సబ్సిడీ నిధులు మురిగిపోయ్యాయని కూడా తెలిపారు. అంతేకాకుండా అన్నం బ్రహ్మం యోజన, అన్నపూర్ణ యోజన వంటి పథకాలను సరిగ్గా అమలు చేయడంలో కూడా గుజరాత్‌ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రతి ఏటా గుజరాత్‌కు 2,250 క్వింటాళ్ల ధాన్యం కోటా ఉంది. అయితే కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కోటాలో కేవలం 241 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వీకరించింది. ఈ లోపంతో రాష్ట్రంలోని 19 జిల్లాలలో వివిధ పథకాల పరిధిలో ఆహార ధాన్యాల పంపిణీ నిలిచిపోయింది. అప్పట్లో కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ఉన్న దశలో గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయడానికి నిరాసక్తత కనబర్చింది. కొన్ని కీలక పథకాలను చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల తరువాతనే అమలు చేసింది. ప్రత్యేకించి రేషన్‌కార్డులు కూడా లేని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇచ్చే 10 నుంచి 15 కిలోల ఆహార ధాన్యాల పథకం అయిన అన్నం బ్రహ్మం యోజనను కూడా గుజరాత్‌ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని కాగ్‌ నివేదికలో తెలిపారు. ఇక కొన్ని జిల్లాలో అయితే అన్నపూర్ణ పథకం పరిధిలో ఎవరెవరికి సాయం చేయాలనే అంశంపై సరైన నివేదికలు కూడా ఇవ్వలేదని వెల్లడైంది. భావ్‌నగర్‌ జిల్లాకు ఆహార ధాన్యాలు కేటాయింపులు జరిగినప్పటికీ, అక్కడ కేవలం నలుగురంటే నలుగురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనాథలకు సాయం చేయడానికి ఉద్ధేశించిన ఈ పథకం ప్రభుత్వ నిర్వాకంతో చివరికి చతికిల పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: