విశాఖ, అనంతపురం జిల్లాలో విప్రో భారీ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నం సెజ్‌లో ఐటీ సంస్థను నెలకొల్పనుంది. రూ.500కోట్లతో అనంతపురం హిందుపూర్‌లో సంతూర్‌ సబ్బుల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసి)ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీకి అందజేశారు. దీనివల్ల భారీ ఎత్తున ఉపాధి లభించనుంది. ఈ మేరకు విప్రో ఛైైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. విశాఖపట్నంలో 2004-05లో ప్రభుత్వం విప్రో సంస్థకు 7.1 ఎకరాలను కేటాయించింది. ఇందులో 4ఎకరాల్లో 2లక్షల చదరపు అడుగులతో కంపెనీని ఏర్పాటు చేసి, 650 ఉద్యోగాలను కల్పించింది. నిరూపయోగంగా ఉన్న 3.1 ఎకరాలకు సెజ్‌ అనుమతి ఇచ్చి, ఎన్‌ఓసి ఇవ్వల్సిందిగా విప్రో ఛైర్మన్‌ ప్రేమ్‌జీ కోరడంతో ప్రభుత్వం అందుకు అంగీకరించింది. 5 ఏళ్ళల్లో 5లక్షల చదరపు అడుగులలో కంపెనీని అభివృద్ధి చేస్తామని చెప్పింది. అదేవిధంగా 7వేల ఉద్యోగాలు కల్పిస్తామని విప్రో ఛైర్మన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసింది. విజయవాడ, కాకినాడ, తిరుపతిలోనూ ఐటీ సంస్థలు ఏర్పాటు చేయటానికి కూడా విప్రో సుముఖత వ్యక్తం చేసింది  అదేవిధంగా అనంతపురం జిల్లా హిందుపూర్‌లో సంతూరు సబ్బుల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి విప్రో ముందుకు వచ్చింది. 50 ఎకరాల్లో రూ.500కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వైద్యరంగంలో ఎమ్‌ఆర్‌ఐ, ఎక్స్‌రె వంటి వాటిల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దేశీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణ ఉంటుంది. మాతశిశుమరణాలు తగ్గించేందుకు అంగన్‌వాడీలకు అవగాహన కలిగించేందుకు కూడా విప్రో ముందుకు వచ్చింది. విప్రో కంపెనీ బాటలో త్వరలో టెక్‌ మహేంద్ర, సమీరా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ముందుకొస్తాయని సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పించేవిధంగా ప్రణాళిక రూపొందిస్తామని సచివాలయంలో విలేకరులతో తెలిపారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ హబ్‌గా ఏర్పాటు చేస్తారని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కంపెనీలకు అనవసరంగా భూములు కేటాయించారని, వాటిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: