కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో నీటిమట్టం వేగంగా పెరగుతున్నది. తుంగభద్ర, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయం పూర్తిగా నిండిపోవటంతో దిగువన ఉన్న నారాయణ్‌పూర్ రిజర్వాయర్‌కు 3,725 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణ్‌పూర్‌కు ఇన్‌ఫ్లోస్ పెరగడంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల రిజర్వాయర్‌కు దాదాపు 250 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఆలమట్టి జలాశయంలోకి నిమిషానికి 1,66,175 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 1700 అడుగులకు చేరింది. దీంతో దిగువ ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్రా నది నిండుకుండను తలపిస్తున్నది. నారాయణ్‌పూర్ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 1615 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 1609 అడుగులకు పెరిగింది. జూరాలకు రెండురోజుల్లో భారీగా నీరు చేరే అవకాశముంది. జూరాలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 8అడుగుల మాత్రమే తక్కువగా నీరు ఉంది. తుంగభద్ర రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 1633 అడుగులుకాగా ప్రస్తుతం 1625కు అడుగులకు చేరింది. listతుంగభద్ర రిజర్వాయర్‌లోకి సెకనుకు 92,891క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలిబండ రిజర్వాయర్‌కు రెండురోజుల్లో నీరు వదిలే అవకాశముంది. కాగా, ప్రధాన రిజర్వాయర్లయిన నిజాంసాగర్, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలంలో నీటిమట్టం కనీసస్థాయికి పడిపోయింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. శ్రీరాంసాగర్ నిల్వ సామర్థ్యం 82.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 24.10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 17 టీఎంసీలు కాగా కేవలం 5.339 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గోదావరి నది దవళేశ్వరం వద్ద 9 అడుగులకు చేరటంతో గోదావరి జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: