లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే పూర్తిగా మాఫీ చేస్తామని ఇప్పుడు సాకులు చెప్పడం సరికాదని మండిపడింది ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సైతం పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్. నరకాసుర పేరుతో సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మలు సైతం దగ్దం చేయించారు. రుణమాఫీ పై ప్రభుత్వానికి రైతులు, మహిళలు అభినందనలు తెలుపుతున్నారని అధికారపక్షం... పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని ప్రజలు మండిపడుతున్నారని ప్రతిపక్షం మొత్తుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా సాగుతున్న ఇరు పక్షాల మాటల యుద్ధంలోకి తాజాగా సీపీఐ ప్రవేశించింది. ఎప్పటిలాగా ప్రతిపక్షానికి కాకుండా ఈసారి అధికార పక్షం పక్షాన మాట్లాడింది. రుణమాఫీ విషయంలో జగన్ తీరును తప్పుబట్టింది. అంతటితో ఆగకుండా జగన్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ ఎద్దేవా చేశారు. రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్ కు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో మతిపోయినట్టుందని గుంటూరులో జరిగిన కౌలు రైతుల సభలో రామకృష్ణ ఆరోపించారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో... 40 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పెద్ద సాహసమని బాబు ప్రభుత్వాన్ని కీర్తించారు కూడా. లక్షన్నర రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చెప్పారు. జగన్ కు మతిభ్రమించడం వల్లనే నరకాసురవధ వంటి మతిలేని కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకాలం ప్రతిపక్షం పై టీడీపీ మంత్రులు ఒక్కొక్కరుగా చేస్తున్న మాటల ధాడికి సీపీఐ మద్దతుతో మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే ఈ విషయంలో జగన్ ను ఏపీ మంత్రులు దేవినేని ఉమ, బొజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి సీనియర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన వైసీపీ అధినేతకు రుణమాఫీని విమర్శించే హక్కు లేనే లేదని ఉమ మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లను దాచిపెట్టిన జగన్ క్రిమినల్ అంటూ మరికొందరు మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే అధికారపక్షం నుంచి ఇంతగా మాటల ధాడి జరుగుతున్నా వైసీపీ నుంచి అంతగా స్పందన రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: