ఒకవేళ పుకార్లే నిజం అయ్యి... అనుకొన్నట్టుగానే జరిగి... ఈ స్వతంత్ర దినోత్సవం నుంచి జనసేన పార్టీ యాక్టివ్ అయితే... ఎన్నికల ముందు పవన్ కల్యాన్ స్థాపించిన ఈ పార్టీ ఒక రాజకీయ వేదికగా మారితే... పవన్ ఎన్నికల ముందు చూపించిన ఆవేశమే ఇకపై కూడా కొనసాగిస్తే... పరిస్థితి ఏమిటి? పవన్ నిజంగానే ప్రశ్నించడం మొదలు పెడితే... ముందుగా టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాల అమలు గురించి దృష్టిపెడితే... అప్పుడు రాజకీయం ఎలా ఉంటుంది? ప్రభుత్వ కార్యకలాపాల్లోని తప్పొప్పుల గురించి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు పవన్ ను బాబు ఎలా కంట్రోల్ చేస్తాడు?! తను కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పాడు కాబట్టి.. ఆ పార్టీ ఇచ్చిన హామీలకు పవన్ కల్యాన్ కూడా బాధ్యుడు అవుతాడు! వాటి అమలుపై ఆయన కూడా దృష్టిపెట్టాల్సి వస్తుంది. అమలు కాని హామీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది! అంతేనా... హామీలు అమలు ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వ కార్యకలాపాల్లోని లోటుపాట్ల గురించి ప్రస్తావించడం, ప్రశ్నించడం మరో ఎత్తు! పవన్ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అతడు రెబల్ గా ఉన్నంతసేపు, అతడు ప్రభుత్వంపై దాడి చేస్తున్నంత సేపే అతడికి విలువ! ఎన్నికల ముందు కాంగ్రెస్ పాలనపై విసుగెత్తిన ప్రజలకు పవనం తోడయ్యింది! కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకొన్నాడు... ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, భారతీయజనతా పార్టీకి మద్దతు పలికాడు. దీంతో అతడి అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. వాళ్లంతా తెలుగుదేశానికి, బీజేపీకి అండగా నిలబడి పరిస్థితి వచ్చింది. ముందుగా ఆ పార్టీలకు ఉన్న బలానికి తోడు.. పవన్ కూడా తోడవ్వడంతో మరింత ఊపు వచ్చింది! ఆ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. రేపు జనసేన యాక్టివ్ అయినా.. అది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే... ప్రభుత్వాలను ప్రశంసించడానికే అయితే.. అది కేవలం పవన్ అభిమానులకు మాత్రమే పరిమితం అవుతుంది. సోషల్ సైట్లలో షేరింగుల పార్టీగా మాత్రమే మిగిలిపోతుంది. తప్పొప్పులను ఎంచుతూ... పవన్ ఒక క్రియాశీల రాజకీయ నేతగా మారి.. ప్రతి విషయం గురించి స్పందిస్తూ ఉంటే.. అప్పుడు అది రాజకీయ పార్టీగా అర్హత సాధించుకొంటుంది. అలాగాకపోతే మాత్రం పవన్ ఇలా గే సైలెంట్ గా ఉంటే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: