కొత్త రాజధాని నిర్మాణానికి తలా ఓ చేయి వెయ్యాలన్న ఏపీ సర్కారు విజ్ఞప్తికి జనం నుంచి బాగానే స్పందన కనిపిస్తోంది. వ్యాపారులు, ఉద్యోగులు, మహిళాసంఘాలు.. ఇలా ఎవరికి తోచినంత వారు విరాళాల రూపంలో సమర్పించుకుంటున్నారు. ప్రత్యేకించి రకరకాల ఉద్యోగ సంఘాలు.. తమ జీతాల్లోంచి విరాళాలు ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ అందుతున్న విరాళాల మొత్తం వంద కోట్లు దాటినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముందే పింఛన్ దార్లు 7 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. మొదటి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సిబ్బంది రూ.50 లక్షలను రాజధాని నిధికి అందజేశారు. చంద్రబాబు పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా మహిళా సంఘాలు దాదాపు కోటీ 50 లక్షల విరాళం ఇచ్చారు. వీటితో పాటు వివిధ పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వర్గాలు, కూడా భారీగానే నిధులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజధాని అభివృద్ధిలో తమవంతు సాయం అందిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు రెండు రోజుల మూల వేతనం ప్రకటించారు. సెప్టెంబర్ లో చెల్లించే ఆగస్టు నెల వేతనం నుంచి ఈ మొత్తాన్ని మినహాయించనున్నారు. ఖజానా, గణాంకాల శాఖ ఉద్యోగులు కూడా రెండు రోజుల మూల వేతనాన్ని ప్రకటించారు. ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్ దార్ల సంయుక్త కార్యాచరణ సమితి.. ఒక రోజు, సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది సమాఖ్య , ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగులు, పంచాయితీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘాలు ఒక రోజు వేతనం ఇస్తున్నట్టు సర్కారుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వివిధ ఆదాయాల్లో కొంత మేర సెస్ విధించి దానిని రాజధాని అభివృద్ధి ఖాతాకు జమ చేసే యోచనలో సర్కారు ఉంది. ఉద్యోగులు, ప్రజలు వివిధ సంఘాలు ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం వంద కోట్ల రూపాయలు దాటినట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది.. అంతేకాదు.. అందుతున్న విరాళాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: