తెలంగాణలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం లేఖ రాశారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ఒకేచోట 200 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపాలని హర్షవర్దన్, కెసిఆర్‌కు రాసిన లేఖలో తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 200 ఎకరాల చొప్పున భూమి సేకరించి ప్రతిపాదనలు తమకు పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ, తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. ఆయా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల బృందం పర్యటించి, ఒక ప్రాంతాన్ని ఖరారు చేస్తుందని హర్షవర్దన్ తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రమే భరిస్తుందని కూడా హర్షవర్దన్ తన లేఖలో స్పష్టం చేశారు.  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ నుంచి లేఖ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కెసిఆర్, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఎయిమ్స్’ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేటాయిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిలు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ను కలిశారు. తమ రాష్ట్రానికి కూడా ‘ఎయిమ్స్’ కేటాయించాలని తెరాస ఎంపిలు, హర్షవర్దన్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు సిద్ధమేనని, అందుకు అవసరమైన భూమి సేకరించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని హర్షవర్దన్ చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: